కృష్ణా బోర్డు దండగ

399
- Advertisement -

కృష్ణా బోర్డుకు నిధులివ్వడం వేస్ట్..?
ఏపీ అక్రమ ప్రాజెక్టులను ఆపలేకపోయిన బోర్డు
ఎపి పక్షపాతిగా కృష్ణా బోర్డుకు అపవాదు
అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవడంలో విఫలం
తెలంగాణ లేఖలు బుట్టదాఖలు
ఎపిపై చర్యలకు ససేమిరా అంటున్న బోర్డు

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కె.ఆర్.ఎం.బి) పనితీరు మరోసారి చర్చనీయాంశమయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తగవులు తీర్చాల్సిన బోర్డు కేవలం ఎపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తోందనే విమర్శలున్నాయి. కృష్ణా నదీ జలాలను అక్రమంగా వాడుకునేందుకు ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను అడ్డుకోవడంలో కృష్ణా రివర్ బోర్డు పెద్దగా ఆసక్తి చూపడంలేదనే పలువురు సీనియర్ అధికారులు ఆరోపిస్తున్నారు. అంతేగాక కె.ఆర్.ఎం.బి పెద్దలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, పక్షపాతధోరణితో వ్యవహరిస్తున్నట్లుగా ఉందని కొందరు సీనియర్ అధికారులు పలు అనుమానాలను వ్యక్తంచేస్తున్నారు. అంతేగాక తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాలను పట్టించుకోకుండా, తెలంగాణ విన్నపాలను బుట్టదాఖలు చేస్తున్న బోర్డుకు తాము ఎందుకు ప్రతి ఏటా వాటా నిధులను ఇవ్వాలి? అని కూడా ఆ అధికారులు సరికొత్త వాదనను లేవనెత్తారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలను పరిష్కరించడంలో విఫలమైన బోర్డుకు అన్ని విధాలుగా సహకరించడంలో అర్ధంలేదని మండిపడుతున్నారు.

కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు కార్యకలాపాలకు ఏటా సుమారు 20 కోట్ల రూపాయల నిధులు అవసరమవుతాయని, అందులో తెలంగాణ రాష్ట్రం కూడా తన వాటాగా సుమారు పది కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తూనే ఉందని తెలిపారు. అయినప్పటికీ బోర్డు ఏ అంశంలో చూసినా తెలంగాణ రాష్ట్రం పట్ల పక్షపాత ధోరణితోనే వ్యవహరిస్తున్నట్లుగా ఉందని ఆ అధికారులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ ప్రజల సొమ్ముతో పనిచేస్తున్న బోర్డు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఏ మాత్రం సహకరించడం లేదనే విమర్శిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం కృష్ణానదిపై తొమ్మిది ప్రాజెక్టులను నిర్మిస్తోందని, ఈ నిర్మాణాల్లో అడుగడుగునా ఇరిగేషన్ నియమ, నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి నష్టం వాటిల్లే విధంగా ప్రాజెక్టులను నిర్మిస్తోందని, అయినప్పటికీ బోర్డు పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందని కొందరు సీనియర్ ఇంజనీరింగ్ అధికారులే అంటున్నారు.

ఈ తొమ్మిది ప్రాజెక్టుల్లో మొత్తం 61 రకాల ఉల్లంఘనలకు ఏపీ ప్రభుత్వం పాల్పడుతోందని సాక్ష్యాధారాలతో సహా బోర్డు దృష్టికి తీసుకెళ్ళామని, ఈ ఉల్లంఘనలపై తగిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే 40 లెటర్లు రాశామని, అయినప్పటికీ కృష్ణా రివర్ బోర్డు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో విసుగుచెందామని అంటున్నారు. గాలేరు-నగరి సుజల స్రవంతి (జి.ఎన్.ఎస్.ఎస్) ప్రాజెక్టు సామర్ధ్యాన్ని పెంచుకునే పనిలో భాగంగా ఏపీ ప్రభుత్వం ఏకంగా 13 రకాల ఉల్లంఘనలకు పాల్పడుతోందని తెలిపారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, దాని ప్రధాన కాల్వ, బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ కాంప్లెక్స్ ను రోజుకు 8 టి.ఎం.సి.ల నీటిని తరలించే విధంగా విస్తరించే పనులకు కృష్ణా రివర్ బోర్డు నుంచి గానీ, కేంద్ర జల సంఘం నుంచిగానీ, బచావత్ అవార్డులో కేటాయింపులు లేవని, కేంద్ర ప్రభుత్వ జల్ శక్తి శాఖ నుంచి ఎక్కడా అనుమతులు లేవని, అయినప్పటికీ ఏపీ ప్రభుత్వం యధేచ్చగా విస్తరణ పనులు చేస్తూనే ఉందని వివరించారు. ఇలా 13 రకాల ఉల్లంఘనలకు పాల్పడుతున్నప్పటికీ కె.ఆర్.ఎం.బోర్డు ప్రేక్షకపాత్ర వహిస్తూనే ఉందనే విమర్శలు తారాస్థాయిలో ఉన్నాయి. అదే విధంగా హంద్రీ-నీవా సుజల స్రవంతి (హెచ్.ఎన్.ఎస్.ఎస్) ప్రాజెక్టు నిర్మాణాల్లో కూడా బచావత్ అవార్డును ఉల్లంఘిస్తూ కృష్ణా నదీ జలాలను ఇతర బేసిన్లకు తరలిస్తోందని, హెచ్.ఎన్.ఎస్.ఎస్.డిపిఆర్‌లో పొందుపరిచినట్లుగా కాకుండా నిబంధనలను ఉల్లంఘించిందని, శ్రీశైలం ప్రాజెక్టులో 875 అడుగులకు వరదనీరు చేరిన తర్వాతనే నీటిని తీసుకుంటామని డి.పి.ఆర్.లో పేర్కొని నేడు మల్యాల వద్ద 833 అడుగులు, ముచ్చుమర్రి వద్ద 798 అడుగుల వద్దకు వరద నీరు చేరగానే నీటిని దారి మళ్ళించే విధంగా హెచ్.ఎన్.ఎస్.ఎస్. ప్రాజెక్టు నిర్మాణాలు సాగుతున్నాయని పేర్కొన్నారు. ఇలా హెచ్.ఎన్.ఎస్.ఎస్. పాజెక్టులోనే పది రకాల ఉల్లంఘనలకు ఎ.పి.ప్రభుత్వం పాల్పడుతోందని తెలిపారు.

అంతేగాక బచావత్ అవార్డుకు తిలోదకాలిస్తూ కర్నూలు-కడప కాల్వ (కె.సి కెనాల్) ఆయకట్టును స్థిరీకరించుకోవడానికి ముచ్చుమర్రి లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టును నిర్మిస్తున్నారని, ఇది ముమ్మాటికీ బచావత్ అవార్డును ఉల్లంఘించిన ట్లేనని, ఎందుకంటే కె.సి.కెనాల్ ఆయకట్టు భూములగే తుంగభద్ర ప్రాజెక్టు పరిధిలోనివని, ఇప్పుడు నిర్మిస్తున్న ప్రాజెక్టు మూలంగా కృష్ణాజలాలను ఇతర బేసిన్లకు తరలిస్తున్నట్లవుతుందని వివరించారు. ఇలా కె.సి.కెనాల్- ముచ్చుమర్రి లిఫ్టు ప్రాజెక్టుల నిర్మాణాల్లో అయిదు రకాల ఉల్లంఘనలు ఉన్నాయని తెలిపారు. బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచిన నిప్పలవాగు, సంతజూటూర్ ఆనకట్ట, శ్రీశైలం కుడికాల్వల విస్తరణ, కొత్త నిర్మాణాల్లో ఏకంగా 14 రకాల ఉల్లంఘనలు ఉన్నాయని వివరించారు. తెలుగుగంగ, సోమశిల ప్రాజెక్టులుకు బచావత్ అవార్డుకు భిన్నంగా కృష్ణా నదీ జలాలను తరలిస్తున్నారని, ఈ రెండు ప్రాజెక్టులపైన మరో ఏడు రకాల ఉల్లంఘనలు జరుగుతున్నాయని తెలిపారు. తుంగభద్ర నదికి కుడివైపున అక్రమంగా 13 లిప్పు ప్రాజెక్టులను (గురు రాఘవేంద్ర లిఫు ఇరిగేషన్ స్కీమ్స్) నిర్మిస్తూ 5.373 టి.ఎం.సి.ల నీటిని అక్రమంగా వినియోగిచుకునేందుకు ఎపి ప్రభుత్వం నిర్మాణాలు చేపట్టిందని వివరించారు.

అదే విధంగా వెలిగొండ ప్రాజెక్టు సొంగాలను 3000 క్యూసెక్కుల నుంచి 11570 క్యూసెక్కుల సామర్ధ్యానికి పెంచుకొంటూ సొరంగం తవ్వగా వచ్చిన మట్టిని శ్రీశైలం జలాశయంలోనే వేస్తున్నారని బోర్డుకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వివరించారు. చిత్రావతి పంప్ట్ స్టోరేజి జల విద్యుత్తు కేంద్రానికి కూడా కృష్ణానదీ జలాలనే వాడుకునే విధంగా ఏపీ ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని వివరించారు. బుగ్గవాగు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సామర్ధ్యాని 3.463 టి.ఎం.సి.ల నుంచి 7 టి.ఎం.సి.లకు పెంచుతూ ఒక ప్రాజెక్టు, ప్రకాశం బ్యారేజీకి దిగువన మరో రెండు బ్యారేజీలను నిర్మించేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని, ఇవన్నీ బచావత్ అవార్డును పూర్తిగా ఉల్లంఘించి నిర్మిస్తున్న ప్రాజెక్టులేనని తెలంగాణ నీటిపారుదల శాఖాధికారులు లేఖలతో కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డుకు ఫిర్యాదులు చేశారు. కానీ బోర్డు పట్టించుకోవడం లేదని అధికారవర్గాలు తీవ్రస్థాయిలో మండి పడుతున్నాయి.

ఇవి కూడా చదవండి..

సినిమా వాళ్లతోనూ స్వామీజీ బ్రోకరిజం

రెండో రోజు జోడో యాత్ర సాగిందిలా!

10 రోజులు బ్యాంకులు బంద్

- Advertisement -