చేనేత కార్మికుల సమస్యలపై మంత్రి కేటీఆర్… ప్రధానికి పోస్ట్ కార్డు రాసి నేతన్నలకు అండగా ముందుకు కదిలిన తరుణంలో… ఆయన పిలుపు మేరకు మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ చేనేత కార్మికుల సమస్యలపై ప్రధానమంత్రికి లేఖ రాశారు. మంగళవారం నాడు మునుగోడు నియోజకవర్గం పరిధిలోని చౌటుప్పల్ 3, 4వ వార్డులకు చెందిన చెందిన పద్మశాలీలు సైతం ప్రధానమంత్రికి పోస్టు కార్డులు రాశారు. చేనేత వస్త్రాలు, చేనేత ఉత్పత్తులపై ఉన్న 5 శాతం జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.
చేనేతపై జీఎస్టీ విధించడం ద్వారా ఈ రంగంపై ఆధారపడి బతుకుతున్న తమ జీవితాలు అన్యాయమైపోతాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తరతరాలుగా నమ్ముకున్న చేనేత వృత్తిని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నాశనం చేస్తుంటే భరించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత కార్మికుల సమస్యలను వివరిస్తూ ప్రధాని మోడీకి పోస్ట్ కార్డ్ రాసే ఉద్యమాన్ని ప్రారంభించినందుకు మంత్రి కేటీఆర్కు చేనేత కళాకారులు కృతజ్ఞతలు తెలిపారు. సత్వరమే చేనేతపై జీఎస్టీ రద్దు చేయాలని చేనేత వృత్తి కార్మికులు కృష్ణ, స్వప్న, వెంకటేష్, నిర్మల తదితరులు డిమాండ్ చేశారు.