బుకర్ ప్రైజ్ విజేత బ్రిటిష్ రచయిత్రి హిలరీ మాంటెల్ మరణించారు. 2009లో ప్రచురితమైన వోల్ఫ్ హాల్ ట్రయాలజీలో భాగంగా మరో మూడేండ్ల తర్వాత వచ్చిన సీక్వెల్ బ్రింగ్ అప్ ది బాడీస్ పుస్తకాలకు ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్‌ను హిలరీ దక్కించుకున్నారు. ఈ రెండు పుస్తకాలు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 50 లక్షల కాపీలకు పైగా అమ్ముడయ్యాయి. ఈ సిరీస్‌లో చివరిదైన ది మిర్రర్ అండ్ ది లైట్ మార్చి 2020లో ప్రచురితమైంది. 1985లో ఆమె తొలి నవల ఎవిరిడే ఈజ్ మదర్స్‌డే ప్రచురితమయింది. హిలరీ మొత్తం 17 పుస్తకాలను రచించారు.
బుకర్ ప్రైజ్‌ను ఆంగ్ల సాహిత్యంలో కృషి చేసిన ఉత్తమ నవలకు ఇస్తారు. ఇది ప్రతి సంవత్సరం కామన్వెల్త్ దేశాలు, ఐర్లాండు, జింబాబ్వే దేశాలకు చెందిన రచయితలకు ఇచ్చే పురస్కారంగా ప్రసిద్ధి గాంచింది.
కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య హిలరీ మాంటెల్ గురువారం తుదిశ్వాస విడిచారని పబ్లిషింగ్ కంపెనీ హాపర్‌కాలిన్స్ ప్రకటించింది. ప్రపంచ పాఠకులపై చెరగని ముద్ర వేసి, వాస్తవ దృక్పధంతో కూడిన రచయిత్రి హిలరీ మాంటెల్ మనల్ని విడిచి వెళ్లడం బాధాకరమని హాపర్‌కాలిన్స్‌కు చెందిన ప్రచురణ సంస్ధ ఫోర్త్ ఎస్టేట్ బుక్స్ ఓ ప్రకటనలో పేర్కొంది.