పోడు భూముల సమస్యలను త్వరలోనే పరిష్కారం చేసుకోబోతున్నామని తెలిపారు సీఎం కేసీఆర్. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 10లో నూతనంగా నిర్మించిన సేవాలాల్ బంజారా భవన్‌ను ప్రారంభించిన అనంతరం మాట్లాడిన సీఎం.. బంజారా ప్రజాప్రతినిధులంతా యాక్టివ్‌గా ఉండి.. పోడు భూముల పరిష్కారంలో చొరవ తీసుకోవాలన్నారు. ఏ జిల్లాలో, ఏ తాలుకాలో, ఏ తండాలో ఏ సమస్యలు ఉన్నాయి. వాటిని ఏ విధంగా రూపుమాపాలి. ఏ విధంగా ప్రభుత్వం సేవలు తీసుకోవాలి అనేదానిపై ఈ భవనం వేదికగా చర్చలు జరగాలన్నారు.
మన రాష్ట్రంలో గిరిజన బిడ్డలు ఎస్టీలు.. మహారాష్ట్రలో బీసీలు. ఇంకో చోట ఓసీలు కూడా ఉన్నారు. ఇట్ల రకరకాలుగా విభజనలో ఉన్నారు. దేశ వ్యాప్తంగా ఉండే గిరిజన బిడ్డలందరికీ సమాన హోదా వచ్చే కార్యక్రమానికి జాతీయ స్థాయిలో మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. గిరిజన బిడ్డల సమస్యల పరిష్కారం కోసం అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
ఎంతో మంది బంజారా బిడ్డలు ఉత్తమమైన సేవలు అందిస్తున్నారు. అనేక రంగాల్లో అనేక హోదాల్లో పని చేస్తున్నారని కేసీఆర్ ప్రశంసించారు. రాష్ట్రంలోని నీటి పారుదల శాఖలో మన బంజారా బిడ్డ హరే రామ్ అందించే సేవలు అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయన్నారు.