దేశానికే దారి చూపే టార్చ్ బేర‌ర్‌గా తెలంగాణ

24
cm
- Advertisement -

2001లో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి నేనే స్వయంగా సారథ్యం వహించి, ఉద్యమ శంఖం పూరించాను. తెలంగాణ ప్రజలందరినీ ఒక్కటిచేసి, పద్నాలుగేళ్లు అవిశ్రాంత పోరాటాన్ని నడిపించాను. లక్ష్య సాధన కోసం మరణం అంచులదాకా వెళ్లేందుకు సిద్ధపడ్డాను. తెలంగాణ ఉద్యమం అంతకంతకూ తీవ్రం కావడంతో ఢిల్లీ ప్రభుత్వం దిగివచ్చింది. ప్రజా ఉద్యమం ఆశించిన గమ్యాన్ని ముద్దాడింది. 2014 జూన్ 2న తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నం సాకారమైంది. తెలంగాణ ఏవిధంగానైతే ఉండాలని ప్రజలు స్వప్నించారో, సంభావించారో.. అదేవిధంగా నేడు తెలంగాణ అన్నిరంగాల్లోనూ అగ్రగామి రాష్ట్రంగా పురోగమిస్తున్నది. రాష్ట్రం ఏర్పడిననాడు ఆవరించి ఉన్న చిమ్మ చీకట్లను చీల్చుకుంటూ పురోగమించి.. దేశానికే దారిచూపే టార్చ్ బేరర్ గా నిలిచింది. విద్యుత్తు, తాగునీరు, సాగునీరు, వ్యవసాయం, ప్రజా సంక్షేమం, పారిశ్రామిక, ఐటీ రంగాలలో అనతికాలంలోనే అద్భుతాలను ఆవిష్కరించి దేశానికే దిశానిర్దేశనం చేస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం అవలంబించిన ప్రగతిశీల, పారదర్శక విధానాల వల్ల రాష్ట్ర సంపద గణనీయంగా పెరిగింద‌ని కేసీఆర్ తెలిపారు.

2013-14లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు రాష్ట్ర జీఎస్డీపీ 5 లక్షల 5 వేల 849 కోట్ల రూపాయలు కాగా, 2021-22 నాటికి 11 లక్షల 54 వేల 860 కోట్ల రూపాయలకు పెరిగింది. తలసరి ఆదాయం పెరుగుదలలోనూ తెలంగాణ రాష్ట్రం జాతీయ సగటును అధిగమించింది. 2014 -15 లో రాష్ట్ర తలసరి ఆదాయం 1 లక్షా 24 వేల 104 రూపాయలు కాగా, 2021-22 నాటికి 2 లక్షల 78 వేల 833 రూపాయలకు పెరిగింది. జాతీయ సగటు కన్నా మన రాష్ట్ర తలసరి ఆదాయం 86 శాతం అధికం కావడం మనందరికీ గర్వకారణం. సంపదను పెంచాలి.. పేదలకు పంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసింది. అనేకరకాల సంక్షేమ పథకాల ద్వారా ఏటా 50 వేల కోట్ల రూపాయలకు పైగా వెచ్చిస్తున్నది. పేద, బలహీన వర్గాల ప్రజలకు జీవన భద్రతను కల్పిస్తున్నద‌ని కేసీఆర్ తెలిపారు.
మ‌తం చిచ్చు మాన‌వ సంబంధాల‌నే మంట గ‌లుపుతుంది..

మతం చిచ్చు ఈ విధంగానే విజృంభిస్తే అది దేశం యొక్క, రాష్ట్రం యొక్క జీవికనే కబళిస్తుంది. మానవ సంబంధాలనే మంట గలుపుతుంది. జాతి జీవనాడిని కలుషితం చేస్తుందని కేసీఆర్ అన్నారు. జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచే సెప్టెంబర్ 17 సందర్భాన్ని సైతం వక్రీకరించి, తమ సంకుచిత స్వార్థ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలనే నీచమైన ఎత్తుగడలకు ఈ విచ్ఛిన్నకర శక్తులు పాల్పడుతున్నాయి. ఆనాటి చరిత్రతో, పరిణామాలతో వీసమెత్తు సంబంధంలేని ఈ అవకాశవాదులు, ఆషాడ భూతులు చిల్లర రాజకీయాలతో ఉజ్వలమైన తెలంగాణ చరిత్రను వక్రీకరించి మలినం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాయని కేసీఆర్ మండిప‌డ్డారు.

అత్యంత మేధో సంపత్తితో, క్రియాశీలతతో చురుకుగా స్పందించే తెలంగాణ సమాజం.. తన బుద్ధి కుశలతను ప్రదర్శించి స్వరాష్ట్రాన్ని సాధించుకుంద‌ని కేసీఆర్ తెలిపారు. అదే క్రియాశీలతను, బుద్ధి కుశలతను మరోమారు చూపించాలి. జాతి జీవనాడిని తెంచేయాలని చూస్తున్న ఈ దుష్ట, భ్రష్ట శక్తుల కుటిల యత్నాలను తిప్పికొట్టాలి. ఈ విషయంలో రెప్పపాటు కాలం ఆదమరిచినా సమాజం కల్లోలంలో కూరుకుపోయే ప్రమాదం ఉందని మరోమారు హెచ్చరిస్తున్నానని సీఎం స్ప‌ష్టం చేశారు.

మీ అందరి అండదండలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిన వ్యక్తిగా, అనునిత్యం తెలంగాణ ప్రజల సర్వతోముఖాభివృద్ధిని ఆకాంక్షించే వ్యక్తిగా, ఈ నేల పై నెలకొన్న శాంతి, సౌభ్రాతృత్వాలను గుండెల నిండా శ్వాసించే వ్యక్తిగా.. ప్రతీ క్షణం ప్రజాశ్రేయస్సు కోసమే పరితపించే వ్యక్తిగా, అన్నింటికి మించి మీ బిడ్డగా ఈ విషయం మీకు చెప్పడం నా కర్తవ్యం. నా గురుతర బాధ్యత అని కేసీఆర్ పేర్కొన్నారు. మీ అందరికీ వినమ్రంగా చేతులు మోడ్చి నమస్కరిస్తూ నేను కోరుకునేది ఒక్కటే.. ఎన్నటికీ ఈ నేల శాంతి, సౌభాగ్యాలతో విలసిల్లాలే తప్ప, అశాంతి, అలజడులతో అట్టుడికి పోవద్దు. తిరిగి తెలంగాణ మరో కల్లోలంలోకి జారిపోవద్దు. తెలంగాణ ఈనాడు ఎంత వేగంగా పురోగమిస్తున్నదో.. అంతేవేగంతో రాబోయే రోజుల్లోనూ అప్రతిహతంగా అభివృద్ధి పథంలో దూసుకు పోవాలి. జాతినిర్మాణంలో ఉజ్వల పాత్రను నిర్వహించాలి. భారత జాతి జాగృతి కోసం, అభ్యున్నతి కోసం మనవంతు దోహదం చేద్దామని అందరినీ కోరుకుంటూ మరోమారు యావత్ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని కేసీఆర్ త‌న ప్ర‌సంగాన్ని ముగించారు.

- Advertisement -