పాట్నా వైద్యా కళాశాలను ఆకస్మికంగా తనిఖీలు చేసిన తేజస్వీ

133
patna
- Advertisement -

బీహార్‌లోని ఆర్జేడీ నేత, ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ ఆకస్మిక తనిఖీలు చేశారు. పాట్నా వైద్య కాలేజీ ఆసుపత్రిని పరిశీలించిన తేజస్వీకి అనుకోని సంఘటన ఎదురైంది. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ నిద్రకు ఉపక్రమించే దృశ్యాలను కళ్లరా చూసి అవాక్కయ్యారు. అలాగే రాత్రి వేళ సీనియర్‌ వైద్యులు విధుల్లో లేరు. హెల్త్‌ మేనేజర్‌ విధులను కూడా నర్సులు నిర్వహిస్తున్నారు. ఒక రోగి మృతదేహాన్ని నిర్లక్ష్యంగా ఆసుపత్రి కారిడార్‌లో వదిలేసినట్టుగా గమనించారు. సెక్యూరిటీ కొరతతో ఆసుపత్రి ఆవరణంలోనే వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్న దృశ్యాలను చూసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆసుపత్రిలోని సౌకర్యాల గురించి మంత్రి ఆరాతీశారు. రోగులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మందుల కొరతపై రోగులు వారి బంధువులు మంత్రి తేజస్వికి మొరపెట్టుకున్నారు. టాయిలెట్లు అపరిశుభ్రంగా ఉన్నాయని, దీంతో మహిళలు కూడా బయటకు వెళ్లి డబ్బులు చెల్లించి, వినియోగించుకోవాల్సి వస్తున్నదని ఫిర్యాదు చేశారు.

అనంతరం మంత్రి తేజస్వి యాదవ్‌ మీడియాతో మాట్లాడారు. పాట్నా వైద్య కాలేజీ ఆసుపత్రి (పీఎంసీహెచ్‌)తో పాటు మరో రెండు హాస్పిటల్స్‌ను రాత్రి వేళ తనిఖీ చేసినట్లు చెప్పారు. పీఎంసీహెచ్‌లోని టాటా వార్డు పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉందన్నారు. ఫార్మసీలో మందుల కొరత, సీనియర్‌ వైద్యులు రాత్రి వేళ అందుబాటులో లేకపోవడం, అపరిశుభ్రత, రోగులకు సౌకర్యాల లేమి వంటి సమస్యలు తన దృష్టికి వచ్చాయని అని అన్నారు. వీటి బాధ్యత అంతా సూపరింటెండెంట్‌దే అని తెలిపారు. ఈ సందర్భంగా హాస్పిటల్‌లోని సమస్యలను త్వరలోనే పరిష్కారిస్తామని హామీనిచ్చారు.

- Advertisement -