న్యాయ వ్యవస్థలో పెండింగ్ కేసులు నానాటికీ పెరిగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా పలు కోర్టులో కలిపి మొత్తం దాదాపు 5కోట్ల కేసులు విచారణ దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో పెండింగ్ కేసులపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పందస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తులు 50 కేసులు పరిష్కరిస్తే మరో కొత్తగా 100కేసులు వస్తున్నాయన్నారు. ఇప్పుడు ప్రజలకు న్యాయవ్యవస్థపై నమ్మకం పెరిగిందన్నారు. న్యాయవ్యవస్థ పట్ల అవగాహన పెరిగింది. తమ వివాదాలను పరిష్కరించుకునేందుకు కోర్టులను ఆశ్రయించేవారు పెరుగుతున్నరని తెలిపారు.
కోర్టుల్లో కేసుల పెండింగ్‌లను తగ్గించేందుకు ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోందన్నారు. సాయుధ బలగాల ట్రైబ్యునల్ సెమినార్‌లో పాల్గొన్న రిజిజు ఈ వ్యాఖ్యలు చేశారు. కోర్టుల్లో వ్యాజ్యాలను తగ్గించేందుకు మధ్యవర్తిత్వంపై చట్టాన్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. భారత్‌ను ఇతర దేశాలతో పోల్చడం సరికాదన్నారు. ప్రపంచంలో చాలా దేశాల్లో 5కోట్ల కంటే తక్కువ జనభా ఉందని గుర్తు చేశారు.
దేశవ్యాప్తంగా పలు కోర్టుల్లో మొత్తంగా 4.83కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు ఇటీవల పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కేంద్ర న్యాయశాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇందులో 4కోట్ల కేసులు కింది కోర్టుల్లో ఉండగా కేవలం 72వేల కేసులు సుప్రీంకోర్టులో ఉన్నాయని ప్రకటించారు.