దేశంలో మంకీపాక్స్ కేసులు నాలుగు చేరాయి. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తిలో మంకీపాక్స్ వైరస్‌ను గుర్తించారు. అయితే అతడికి ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేకపోవడం గమనార్హం. బాధితుడు ప్రస్తుతం ఢిల్లీలోని మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నాడని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 31 ఏండ్ల బాధితుడు జ్వరం, చర్మంపై దద్దుర్లతో దవాఖానలో చేరాడని తెలిపింది. అతడు ఇటీవలికాలంలో విదేశీ ప్రయాణం చేయలేదని అధికారులు చెప్పారు. కేరళలో ఇప్పటికే మూడు మంకీపాక్స్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. కేరళలో జులై 14న తొలి మంకీపాక్స్ కేసు వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత దుబాయ్ నుంచి కన్నూర్‌కు వచ్చిన వ్యక్తికి జులై 18న పాజిటివ్ వచ్చింది. ఇక ఈ నెల 22న కేరళలో మూడో కేసు బయటపడిన విషయం తెలిసిందే.
అనేక దేశాల్లో వేగంగా వ్యాప్తి చెందుతూ ఆందోళన కలిగిస్తున్న మంకీపాక్స్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. మంకీపాక్స్‌ను ప్రజారోగ్య అత్యయిక పరిస్థితిగా ప్రకటించిన నేపథ్యంలో అన్ని దేశాలు వ్యాధిపై సమన్వయంగా స్పందిస్తూ పోరాడాలని డబ్ల్యూహెచ్‌వో పిలుపునిచ్చింది. ఇప్పటివరకు 74 దేశాల్లో 16 వేలకుపైగా మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. వీటిలో ఎక్కువగా ఐరోపా దేశాల్లోనే ఉన్నాయి. యూరప్‌లో 86 శాతం కేసులు ఉండగా, అమెరికాలో 11 శాతం నమోదయ్యాయి.
అయితే ఆఫ్రికాలో మాత్రమే మంకీపాక్స్ వల్ల మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం మంకీపాక్స్‌కు నిర్దిష్ట చికిత్స అనేది లేదు. ఇతరులకు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు రోగులు స్పెషలిస్టు దవాఖానాలో చేరి లక్షణాలకు చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది.