దేశ అభివృద్ధిలో యువత భాగస్వామ్యం కావాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని మహీంద్రా యూనివర్సిటీ నిర్వహించిన తొలి స్నాతకోత్సవంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. దేశ జనాభాలో సగానికి పైగా 27 ఏండ్ల వారేనని తెలిపారు. ప్రస్తుతం యువత ఆవిష్కరణల్లో చాలా చురుకుగా ఉందని కొనియాడారు. కాని ప్రస్తుత కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో పయనిస్తుందని దానిని పురోగమనంలో తీసుకెళ్ళే గొప్ప నాయకత్వ లక్షణాలు యువతలో ఉన్నాయని వాటిని స్వదినియోగం చేసుకొవాలన్నారు. నాయకులు కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా, ఆర్థిక అంశాలపై దృష్టి సారించాలని కేటీఆర్ సూచించారు.
దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు మహీంద్రా యూనివర్సిటీలో చదువుతున్నారని తనకు తెలుసన్నారు. అయితే హైదరాబాద్, తెలంగాణలో ఉన్న ఉద్యోగ అవకాశాలను పరిశీలించాలన్నారు. ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ను ప్రమోట్ చేసేందుకు తెలంగాణ చాంపియన్ స్టేట్‌గా ఉందన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా తెలంగాణ పెట్టుబడులను ఆకర్షిస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు. అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిందని చెప్పడానికి తాను గర్వపడుతున్నానని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.