ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పే వారి గొంతును మోదీ సర్కార్ నొక్కివేస్తోందని విపక్ష నేతలు ఓ సంయుక్త ప్రకటనలో దుయ్యబట్టారు. దర్యాప్తు సంస్ధలను ప్రయోగించి వివిధ పార్టీలకు చెందిన రాజకీయ ప్రత్యర్ధులపై మోదీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఈడీ ప్రశ్నిస్తున్న నేపధ్యంలో రాజకీయ ప్రత్యర్ధులపై కేంద్ర దర్యాప్తు సంస్ధలను దుర్వినియోగం చేస్తూ కేంద్రం వేధింపులకు గురిచేస్తోందని విపక్షం భగ్గుమంది. ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న మోదీ ప్రభుత్వంపై తమ పోరాటం తీవ్రతరం చేస్తామని విపక్ష నేతలు ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.
ఈ ప్రకటనపై శివసేన, వీసీకే, డీఎంకే, ఆర్జేడీ, సీపీఐ, సీపీఎం, టీఆర్ఎస్, ఆర్ఎస్పీ సహా పలు పార్టీల నేతలు సంతకాలు చేశారు. అంతకుముందు పార్లమెంట్లో రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే కార్యాలయంలో విపక్ష పార్టీల ఫ్లోర్ లీడర్లు సమావేశమయ్యారు. ఇక సోనియా గాంధీ ఈడీ ఎదుట హాజరయ్యేందుకు ముందు పార్టీ ఎంపీలు పార్లమెంట్ నుంచి పార్టీ ప్రధాన కార్యాలయానికి ప్రదర్శనగా వెళ్లారు. మోదీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆందోళన చేపట్టారు.