సోమవారం అసోచామ్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో కేంద్ర రెవెన్యూశాఖ కార్యదర్శి తరుణ్ బజాజ్ మాట్లాడారు. పెట్రోల్, డీజిల్ సహా చమురు ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తేవాలంటే మరికొంత కాలం ఆగక తప్పదని కేంద్ర ప్రభుత్వం తేల్చేసింది. ముడి చమురు సంబంధిత పెట్రోల్, డీజిల్, గ్యాస్ తదితరాలు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయమన్నారు. చమురు ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తేవాలంటే కొన్ని ఆందోళనలు ఉన్నాయని తరుణ్ బజాజ్ చెప్పారు.
తొలి నుంచి పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తేవాలని పారిశ్రామిక వర్గాలు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి. జీఎస్టీ అమలు ప్రారంభమై ఐదేండ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో వివిధ వస్తువులు, సేవలపై జీఎస్టీ హేతుబద్ధీకరణ, ఆత్మ శోధనపై జరిగిన చర్చాగోష్టిలో తరుణ్ బజాజ్ మాట్లాడుతూ విలాస వస్తువులు, హానికర వస్తువులపై భవిష్యత్‌లోనూ 28 శాతం జీఎస్టీని కొనసాగించాలని కేంద్రం భావిస్తున్నదన్నారు.
లగ్జరీ, హానికర వస్తువుల్లో ఏయే వస్తువులపై 5,12,18 శాతం శ్లాబ్‌లు ఉండాలి. వేటిపై రెండు శ్లాబ్‌లు అమలు చేయాలి. ఉత్పత్తులను 5,12,18 లేదా రెండు శ్లాబ్‌ల పరిధిలోకి తెచ్చే విషయమై చర్చలకు తలుపులు తెరిచే ఉన్నాయన్నారు. దేశ వృద్ధిరేటు ఎలా.. ఎక్కడ ఒకే శ్లాబ్‌లోకి పన్నురేట్లు తేవాలి.. ఇది చాలా క్లిష్టమైన సవాల్` అని తరుణ్ బజాజ్ చెప్పారు. రోజువారీ నిత్యావసర వస్తువులపై పూర్తిగా పన్ను మినహాయింపు లేదా కనిష్టంగా ఐదు శాతం పన్ను వసూలు చేస్తున్నారు. కార్లు, ఇతర లగ్జరీ వస్తువులపై అత్యధికంగా 28 శాతం పన్ను విధిస్తున్నారు. 12, 18 శాతం శ్లాబ్‌లు కూడా ఉన్నాయి. ఇక బంగారం, బంగారు ఆభరణాలు, అరుదైన లోహాలపై ప్రత్యేకంగా మూడు శాతం, పాలిష్డ్ అండ్ కట్ డైమండ్స్‌పై 1.5 శాతం టాక్స్ వసూలు చేస్తున్నారు.