సికింద్రాబాద్‌లో అగ్నిపథ్‌ ఆందోళనలు..

81
Agnipath protests
- Advertisement -

శుక్రవారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో అగ్నిపథ్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు భారీ విధ్వంసం సృష్టించిన తెలిసిందే. ఈ రోజు ఉదయం నుంచి సికింద్రాబాద్ స్టేషన్ తీవ్రస్థాయి నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఘటనలో ఆందోళకారులపై పోలీసులు కాల్పులు జరపగా, ఓ యువకుడు మృతి చెందాడు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద ఇంకా ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ఉదయంతో పోల్చితే నిరసనకారుల సంఖ్య కాస్త తగ్గినా, ఇప్పటికీ అక్కడ ఆందోళనకర పరిస్థితి కొనసాగుతోంది. ఆందోళనకారులతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని రైల్వే అధికారులు వివరించారు. రైల్వే స్టేషన్ లోనే ఉన్న ఆందోళనకారులు తాము చర్చలకు వెళ్లబోమని చెబుతున్నారు. ఆర్మీ ఉద్యోగ నియామక అధికారి తమ వద్దకు రావాలని డిమాండ్ చేస్తున్నారు.

అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దేశంలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు, అల్లర్లు జరుగుతున్నాయి. నిన్నటి వరకు ఉత్తరాది రాష్ట్రాలకు పరిమితమైన అల్లర్లు ఈరోజు తెలంగాణలో కూడా మొదలయ్యాయి. అగ్నిపథ్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది ఆర్మీ ఉద్యోగార్థులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌పై దాడి చేస్తున్నారు. స్టేషన్‌లో ఆర్పీఎఫ్, జీఆర్పీ, రాష్ట్ర పోలీసు బలగాలను మోహరించినట్టు అధికారులు తెలిపారు. రైల్వే ఆస్తులు ధ్వంసం చేసినవారిపై చర్యలు తీసుకుంటామని సీపీఆర్వో స్పష్టం చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టు రైల్వే శాఖ చీఫ్ పబ్లిక్ రిలేషన్ అధికారి (సీపీఆర్వో) వెల్లడించారు.

కాగా, ఈ ఆందోళనల నేపథ్యంలో రైలు ప్రయాణికుల కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. ప్రయాణికులు రైల్వే అధికారులను 040-27786666 నెంబరు ద్వారా సంప్రదించాలని రైల్వే శాఖ పేర్కొంది.

- Advertisement -