పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ 2021-2022 వార్షిక నివేదికను శుక్రవారం రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోని టాప్ 30 నగరాల్లో హైదరాబాద్‌ను ఒకటిగా ఉంచడమే తమ లక్ష్యమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పట్టణాలు, నగరాల్లో సమ్మిళిత, సమీకృత అభివృద్ధే ధ్యేయంగా ముందుకు పోతున్నామని చెప్పారు. రాష్ట్రంలో పట్టణాలు, నగరాలకు ఆర్థిక వనరులు, మానవ వనరులను సమకూరుస్తున్నామని, మున్సిపల్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేస్తున్నామని వెల్లడించారు. పట్టణాలకు ప్రతి నెలా పట్టణ ప్రగతి కింద నిధులను విడుదల చేస్తున్నామని తెలిపారు.
మున్సిపల్ శాఖలో సమ్మిళితమైన- సమీకృత అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోతున్నామని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రంలో పట్టణ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయని, రాష్ట్రంలో మరికొన్ని నగరాలను స్మార్ట్ సిటీలుల కింద చేర్చాలని ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. వరంగల్, కరీంనగర్ స్మార్ట్ సిటీ పనులు చురుగ్గా సాగుతున్నాయని వెల్లడించారు. హైదరాబాద్ నగరం రోడ్లు బాగుండాలనే ఉద్దేశంతో సీఆర్‌ఎంపీ కింద తీసుకున్నామని, హైదరాబాద్ నగర పరిస్థితి, ఇమేజ్ రోడ్ల నాణ్యత మీద ఆధారపడి ఉంటుందన్నారు.
50 వేల జనాభా ఉన్న పట్టణాల్లో రెండు వార్డులకు కలిపి ఒక అధికారి, 50వేలకు పైగా జనాభా ఉన్న పట్టణాలు, నగరాల్లో వార్డుకు ఒక అధికారిని నియమించనున్నట్లు మంత్రి కేటీఆర్ వివరించారు. వచ్చే సంక్రాంతి కల్లా 100 శాతం మురుగు నీటి వ్యర్థాలను శుద్ధి చేసే తొలి నగరంగా హైదరాబాద్ దేశంలోనే గుర్తింపు పొందుతుందన్నారు. హైదరాబాద్‌లో భవిష్యత్ తరాలకు ఎలాంటి నీటి కొరత లేకుండా సుంకిశాల వద్ద రూ.1450కోట్ల వ్యయంతో ఇంటెక్‌వెల్ పనులను ప్రారంభించామని తెలిపారు.
టీయూఎఫ్‌ఐడీసీ ద్వారా పట్టణాలకు నాలుగు వేల కోట్లను కేటాయించామని పేర్కొన్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని పది పట్టణాలను గుర్తించి రూ.2410 కోట్లతో 104 రోడ్లను వేయనున్నట్లు చెప్పారు. దీని ద్వారా హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లోనూ రోడ్లు మెరుగుపడుతాయని తెలిపారు. టీఎస్‌బీపాస్ ద్వారా 1.15 లక్షల కంటే ఎక్కువ దరఖాస్తులను పరిష్కరించామన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో జీహెచ్‌ఎంసీలో రూ.3500కోట్ల విలువైన టీడీఆర్ ధృవపత్రాలను జారీ చేసిందని మంత్రి కేటీఆర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అర్వింద్ కుమార్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, పురపాలక శాఖ డైరెక్టర్ సత్యనారాయణ, హైదరాబాద్ మెట్రో రైల్ ఎండి ఎన్వీఎస్ రెడ్డి, జలమండలి ఎండి దాన కిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ పాల్గొన్నారు.