దర్శకధీరుడు రాజమౌళి తీసిన చిత్రం‘బాహుబలి ది బిగినింగ్’ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. దాదాపు రూ. 600 కోట్ల వసూళ్లు సాధించి భారతీయ చలనచిత్ర పరిశ్రమ దృష్టి టాలీవుడ్‌పై పడేలా చేసింది. దక్షిణాదిన అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం ఇప్పటికీ ‘బాహుబలి’నే. ఇప్పుడు ‘బాహుబలి ది కన్‌క్లూజన్’పైనా అలాంటి అంచనాలే ఏర్పడ్డాయి. ‘బాహుబలి 2’ ట్రైలర్ ఈమధ్యే విడుదలై ఎన్నో రికార్డులకు వేదికగా మారింది. తొలి 24 గంటల్లో తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో 5 కోట్ల పైచిలుకు వ్యూస్ వచ్చాయి. భారతీయ చలన చిత్రసీమలో ఇదే రికార్డు. అత్యధిక వీక్షణలు పొందిన చిత్రంగా ప్రపంచ వ్యాప్తంగా 13వ స్థానంలో నిలిచింది. ఇక లైకుల విషయంలోనూ బాహుబలిదే రికార్డు. ఇప్పటి వరకూ 10 లక్షల పైచిలుకు లైక్స్ ‘బాహుబలి 2’ సొంతం చేసుకొంది.
ఎన్నో రికార్డులను సొంత చేసుకున్న ఈ సినిమాను సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ తేలిగ్గా తీసిపడేశారు . అసలు ‘బాహుబలి’ సినిమాలో ఏముంది అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన ‘బాహుబలి’ గురించి మాట్లాడారు.
బోలెడు ఖర్చుపెట్టి సెట్‌లు వేసి సినిమా తీసేస్తే మన తెలుగు సినిమా స్థాయి పెరిగినట్టేనా? మొన్న ‘బిచ్చగాడు’ అనే చిన్న సినిమా వచ్చింది. బ్రహ్మాండంగా ఆడింది. గతంలో వచ్చిన ఎన్నో సినిమాలు అద్భుతంగా ఆడాయి. వాటిల్లో నీతి కూడా ఉండేది. కళ్లు జిగేల్‌మనిపించేలా సెట్లు వేసేస్తే తెలుగు సినిమా స్థాయి పెరిగినట్టా’ అని సత్యనారాయణ ప్రశ్నించారు.
తాను ‘బాహుబలి’ సినిమా చూశానని.. . ఏముంది అందులో… కథగా చెప్పుకోవడానికి అసలేముందని ప్రశ్నించారు. ఆ సినిమా గురించి చాలా సింపుల్‌గా మూడు వాక్యాల్లో చెప్పొచ్చని.. భారీ సెట్లు, గ్రాఫిక్స్ మాత్రం ఉన్నాయన్నారు. అప్పటి రోజుల్లో వాటిని ‘ట్రిక్స్’ అనే వాళ్లమని.. ఇప్పుడు దానికి పేరు పెట్టి ‘గ్రాఫిక్స్’ అంటున్నారన్నారు. మన మార్కెట్‌కు ఐదొందల కోట్లు పెట్టాల్సిన అవసరముందా?. ఆ బడ్జెట్‌తో ఐదొందల సినిమాలు చేసుకోవచ్చన్నారు. అయినా ఇలాంటి సినిమాలను హాలీవుడ్ వాళ్లు ఎప్పుడో తీశారని.. వీటన్నింటినీ ఎన్నో ఇంగ్లీష్ సినిమాల్లో చూశామన్నారు.