ఏపీ మంత్రి విడదల రజనీ తెలంగాణ ఆడ బిడ్డే..

371
vidadala rajini
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన విడదల రజని పక్కా తెలంగాణ బిడ్డ అనే విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అంతేకాదు, తెలంగాణలోని ఆమె స్వగ్రామంలో సంబురాలు కూడా జరుగుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం కొండాపురం గ్రామానికి చెందిన రాగుల సత్తయ్య రెండో కూతురు రజని ఏపీ మంత్రి కావడంపై ఆ గ్రామంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రజని కుటుంబంతో తమ అనుబంధాన్ని గ్రామస్తులు గుర్తుచేసుకుంటున్నారు.

రజని తండ్రి సత్తయ్య బతుకుదెరువు కోసం 40 ఏళ్ల కిందట కొండాపురం నుంచి హైదరాబాద్ వలస వెళ్లారు. సికింద్రాబాద్ పరిధిలోని సఫిల్ గూడలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఆయనకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. రజని రెండో కూతురు. హైదరాబాద్‌లో 24-06-1990న పుట్టిన విడదల రజని.. ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధ మల్కాజ్‌గిరి లోని సెయింట్ ఆన్స్ మహిళా డిగ్రీ కళాశాలలో 2011లో బీఎస్సీ కంప్యూటర్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం ఎంబీఏ కూడా చదివారు. హైదరాబాద్ లోనే ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగినిగా కొన్నాళ్లు పనిచేశారు.

ఐటీ ఉద్యోగం చేస్తున్న సమయంలోనే ఆంధ్రప్రదేశ్ కు చెందిన విడదల కుమారస్వామితో రజనికి వివాహం అయింది. మెరుగైన అవకాశాల కోసం భారతీయ యువతలాగే అమెరికా బాట పట్టారు. అమెరికాలో ఉన్నప్పుడే సొంతగా ఐటీ కంపెనీని ఏర్పాటు చేశారు. భర్తతో కలిసి రజని అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉంటూ సాఫ్ట్‌వేర్‌ మల్టీ నేషనల్‌ కంపెనీ ప్రాసెస్ వీవర్ కంపెనీ ఏర్పాటు చేశారు. దీనికి కొన్నాళ్ల పాటు డైరెక్టర్, బోర్డు మెంబర్‌గా సేవలు అందించారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన రజనీకి ఇద్దరు పిల్లలు, ఒక బాబు, ఒక పాప.

అమెరికా నుంచి తిరిగొచ్చిన తర్వాత విడదల రజనీ.. 2014లో టీడీపీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. ‘సైబరాబాద్ ఐటీ వనంలో చంద్రబాబు నాటిన మొక్కను నేను..’అంటూ రజనీ చేసిన ప్రసంగం ఇప్పటికీ వైరల్ జాబితాలో నిలుస్తుంది. భర్త కుమారస్వామి స్వస్థలమైన చిలకలూరిపేట నుంచే రజని రాజకీయాల్లో కొనసాగుతున్నారు.

ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో భర్త కుమారస్వామి ప్రోత్సాహంతో విడదల రజని తన పేరు మీదే వీఆర్ ఫౌండేషన్ ను ప్రారంభించారు. సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు. 2018లో ఆమె టీడీపీని వీడి వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా గెలిచారు. అప్పటికే చిలకలూరిపేటలో బలంగా పాతుకుపోయిన అగ్రవర్ణ నేతలను ఢీకొట్టి బీసీగా, చిలకలూరిపేట నియోజకవర్గంలో గెలిచిన తొట్ట తొలి బీసీ మహిళగా రజని చరిత్ర సృష్టించారు. శాసనసభ వేదికగా.. తనదైన శైలిలో వివిధ ప్రజా ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలపై గళం విప్పే రజని సోషల్ మీయాలోనూ యాక్టివ్ గా ఉంటారు.

ఆంధ్రప్రదేశ్ లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా విడదల రజనికి మంత్రి పదవి దక్కింది. సీఎం జగన్ ఆమెకు కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ, వైద్య విద్య శాఖలను కేటాయించారు. అంతేకాదు, కొత్త మంత్రులు వచ్చాక జగన్ చేపట్టిన తొలి రివ్యూ కూడా రజని శాఖదే కావడంతో ఆమె లక్కీ మంత్రి అనే ప్రచారమూ సాగుతోంది. విడదల రజని విజయాలపై ఆమె తండ్రి సత్తయ్య స్వస్థలం యాదాద్రి జిల్లాలో సంబురాలు జరుగుతున్నాయి. తెలంగాణ ఆడబిడ్డగా.. ఆంధ్రప్రదేశ్ కోడలుగా రెండు రాష్ట్రాల్లోనూ అభిమానులను పొందారు రజని.

- Advertisement -