తెలంగాణలో ఒమిక్రాన్‌ వ్యాప్తి.. హెల్త్ డైరెక్టర్ ఏమన్నారంటే..

172
- Advertisement -

తెలంగాణలో కరోనా కేసులతో పాటు ఒమిక్రాన్ వేరియెంట్ కేసులు కూడా పెరుగుతున్నాయి.. రోజువారీ కేసులు గురువారం ఎక్కువయ్యాయి. వచ్చే రెండు నెలల్లో తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు కూడా మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే డీహెచ్ శ్రీనివాసరావు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఆయన కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో కోఠిలోని హెల్త్‌ ఆఫీస్‌లో మీడియా సమావేశంలో కీలక విషయాలను వెల్లడించారు.

తెలంగాణలో నమోదవుతున్న కరోనా కేసుల్లో 70 శాతం ఒమిక్రాన్ బాధితులే ఉంటారని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ జి.శ్రీనివాసరావు చెప్పారు. అయితే, అందరికీ జీనోమ్ సీక్వెన్స్ చేయడం సాధ్యం కాదని ఆయన చెప్పారు. ఇప్పటికే ఒమిక్రాన్ సమూహ వ్యాప్తి మొదలైందని అన్నారు. రాష్ట్రంలో లాక్ డౌన్ విధించే యోచన లేదని, పేదల బతుకుదెరువు చాలా ముఖ్యమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామన్నారు.

వచ్చే నాలుగు వారాలు కీలకమని, ఫిబ్రవరి మధ్యలో కేసులు తగ్గే అవకాశం ఉందని చెప్పారు. టీకాలు తీసుకోని వారు వెంటనే తీసుకోవాలని ఆయన సూచించారు. మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని కోరారు. లక్షణాలుంటే సొంత వైద్యం చేసుకోవద్దని, వైద్యుల వద్దకు వెళ్లాలని సూచించారు. 2 కోట్ల కరోనా టెస్ట్ కిట్లతో పాటు కోటికిపైగా హోం ఐసోలేషన్ కిట్లను సిద్ధంగా ఉంచామన్నారు. కరోనా మూడో వేవ్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

జనవరి 1 నుంచే రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయన్నారు. ఐదురోజులుగా 4 రెట్లకుపైగా కేసులు వస్తున్నాయన్నారు. పాజిటివిటీ రేటు 3 శాతానికిపైగా ఉందన్నారు. కరోనా పేషెంట్లలో జలుబు, స్వల్ప జ్వరం, తీవ్ర తలనొప్పి వంటి కొన్ని లక్షణాలే ఉన్నాయన్నారు. 

- Advertisement -