గురువారం రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సంగారెడ్డి జిల్లాలో పర్యటించారు. ఇందులో భాగంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈమేరకు సంగారెడ్డి కలెక్టరేట్లో ఏడు వైకుంఠ రథాలను ప్రారంభించారు,అలాగే జిల్లా కేంద్రంలో సమీకృత మార్కెట్ సముదాయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, క్రాంతి కిరణ్, ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, బీబీ పాటిల్ ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రగతి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 142 మున్సిపాలిటీలకు రూ. 3,041 కోట్లు విడుదల చేశామని కేటీఆర్ గుర్తు చేశారు. సంగారెడ్డి పట్టణంలో ఇవాళ ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్‌కు రెండు ఎకరాల స్థలంలో శంకుస్థాపన చేశామని తెలిపారు. దీన్ని రూ. 6 కోట్ల 72 లక్షల వ్యయంతో నిర్మించనున్నారు. 142 మున్సిపాలిటీల్లో రూ. 500 కోట్లతో ఆధునీకమైన వెజ్ నాన్ వెజ్ మార్కెట్లు నిర్మిస్తున్నాం. గౌరవంగా అంతిమ సంస్కారాలు జరగాలనే ఉద్దేశంతో వైకుంఠధామాలను నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు.
సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీలకు రాబోయే వారం పది రోజుల్లో రూ. 50 కోట్లు విడుదల చేస్తామని స్పష్టం చేశారు. మున్సిపల్ కార్మికులకు జీతాలు ఇవ్వలేని దుస్థితి గతంలో ఉండేది. కేసీఆర్ సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పట్టణ, పల్లెప్రగతి కార్యక్రమం కింద నిధులు విడుదల చేసి సఫాయి కార్మికులకు నెల నెల జీతాలు చెల్లిస్తున్నాం. గతంలో తక్కువ జీతాలతో కార్మికులు బాధపడేవారు. ఇవాళ రాష్ట్రంలో సఫాయి కార్మికులకు రూ. 12 వేలకు తగ్గకుండా ఇస్తున్నాం అని కేటీఆర్ స్పష్టం చేశారు. పట్టణ ప్రగతి కింద సంగారెడ్డి పట్టణానికి ప్రతి నెలలో రూ. 15 కోట్ల 30 లక్షలు, సదాశివపేటకు రూ. 7 కోట్ల 95 లక్షలు, జహీరాబాద్‌కు రూ. 16 కోట్ల 9 లక్షల నిధులు చెల్లిస్తున్నామని తెలిపారు. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలకు ఇప్పటి వరకు రూ. 66 కోట్ల 12 లక్షలు విడుదల చేశామన్నారు.
సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేల పట్ల వివక్ష చూపలేదు. సంగారెడ్డి నియోజకవర్గంలో రూ. 550 కోట్లతో ఒక మెడికల్ కాలేజీని, నర్సింగ్ కాలేజీని మంజూరు చేశారు. జగ్గారెడ్డి అసెంబ్లీలో మెడికల్ కాలేజీ కావాలని అడిగిన వెంటనే ఆ కాలేజీని మంజూరు చేశారు. త్వరలోనే ఈ కాలేజీకి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు. జీవో 58,59 మళ్ళీ తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తున్నాం అని తెలిపారు. దీనికి సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ స్థలాల్లో పేదలు ఇండ్లను నిర్మించుకుంటే, వాటిని క్రమబద్దీకరించేందుకు పరిశీలన చేస్తామన్నారు. పటిష్టంగా అన్ని పట్టణాలను అభివృద్ధి చేసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడుల్లో సింహభాగం సంగారెడ్డికి వస్తున్నాయి. దీంతో స్థానిక యువకులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. సంగారెడ్డి జిల్లా అభివృద్ధికి అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్దామని కేటీఆర్ చెప్పారు.