శాంతి భద్రతల పరిరక్షణకు విప్లవాత్మక చర్యలు..

162
- Advertisement -

ప్రజల కోసమే పోలీసులు ఉన్నారని, శాంతిభద్రతలను కాపాడడంలో తెలంగాణ పోలీస్ ముందు స్థాయిలో ఉందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ కితాబు ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం కేంద్రంలో 80 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన అత్యాధునిక పోలీస్ స్టేషన్ భవనాన్ని హోంమంత్రి మహమూద్ అలీ గురువారం లాంఛనంగా ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, కుచుకుళ్ల దామోదర్ రెడ్డి, జెడ్పి చైర్ పర్సన్ తీగల అనిత రెడ్డి, సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఎంపీపీ వై రవీందర్ యాదవ్, స్థానిక జడ్పిటిసి విశాల రెడ్డి, ఏసీపీ కుషాల్కర్, సిఐ సత్యనారాయణ, ఎస్సై కోన వెంకటేశ్వర్లు తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా హోం మంత్రి మహమూద్ అలీ పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించగా ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఎస్ హెచ్ ఓ గదిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హోం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ నడుం బిగించిందని పేర్కొన్నారు. ప్రజల సౌకర్యార్థం పెట్రోలింగ్ వ్యవస్థను పటిష్టపరచడంలో భాగంగా 7వందల కోట్ల రూపాయలను కేటాయించారని, 28 వేల పోలీస్ పోస్టులను భర్తీ చేశారని వివరించారు. ఎప్పుడు లేని విధంగా 33 శాతం మహిళా సిబ్బంది పోస్టులను భర్తీ చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం అనేక విప్లవాత్మక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఏడు లక్షల సిసి కెమెరాల ద్వారా నిత్యం శాంతిభద్రతల పర్యవేక్షణ ఉంటుందని, 26 జిల్లా పోలీసు కార్యాలయం అత్యద్భుతంగా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

సిద్దిపేటలో అత్యాధునిక కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయం నిర్మించినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఐటీ, సైబర్ నేరాలను అరికడుతున్నట్టు తెలిపారు. లండన్, అమెరికాకు ఏ మాత్రం తీసిపోకుండా నాణ్యమైన సేవలు నిర్వహిస్తున్నామని వివరించారు. రౌడీయిజాన్ని కంట్రోల్‌లో పెట్టి అవసరమైతే పిడి యాక్టులు నమోదు చేశామని తెలిపారు. శాంతిభద్రతలను కాపాడడంలో ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. షాద్ నగర్ పోలీస్ స్టేషన్ భవనం, సిబ్బందికి క్వార్టర్స్ కూడా త్వరలో నిర్మించేందుకు ప్రణాళికలు చేపడతామని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే పాస్ పోర్టులు లభిస్తున్నాయని తెలిపారు. జెపి దర్గా వద్ద ఔట్ పోస్ట్ ఏర్పాటు అవుతుందని తెలిపారు. మీడియా కూడా తప్పకుండా మాస్కులు ధరించి వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉండి నాణ్యమైన సేవలు అందించాలని మంత్రి కోరారు.

- Advertisement -