బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో వేదికగా జరుగుతున్న యాషెస్ సిరీస్ తొలి టెస్టు నాలుగు రోజుల్లోనే ముగిసింది. ఇంగ్లండ్‌పై 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆది నుంచి తడబడి చివరికి ఓటమి పాలైంది. బ్యాటింగ్ బౌలింగ్ విభాగాల్లో దారుణంగా విఫలమైన ఇంగ్లండ్ ఐదు రోజులు కూడా పోరాడలేక చేతులెత్తేసింది. ఫలితంగా నాలుగు రోజుల్లోనే మ్యాచ్ ముగిసింది.
తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 147 పరుగులకే కుప్పకూలగా, ఆస్ట్రేలియా ఏకంగా 425 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ కీపర్ జోస్ బట్లర్ చేసిన 39 పరుగులే అత్యధికం కాగా, ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ 152 పరుగులు చేశాడు. లబుషేన్ 74 పరుగులు సాధించాడు.
ఇక, రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ పోటీ ఇచ్చినట్టే కనిపించింది. మలాన్, కెప్టెన్ రూట్ చెలరేగారు. దీంతో భారీ స్కోరు దిశగా దూసుకెళ్తున్నట్టు కనిపించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 220 పరుగులతో బలంగా ఉన్నట్టు కనిపించింది. రూట్, మలాన్ సెంచరీలు చేయడం ఖాయమని భావించారు.
అయితే, ఆసీస్ బౌలర్లు చెలరేగడంతో నాలుగో రోజు ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ఒక్కసారిగా కుప్పకూలింది. 77 పరుగులు మాత్రమే చేసి మిగతా 8 వికెట్లను చేజార్చుకుంది. మలాన్ 82, రూట్ 89 పరుగులు చేసి అవుటయ్యారు. ఫలితంగా ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ 297 పరుగుల వద్ద ముగిసింది.
ఫలితంగా ఆస్ట్రేలియా విజయానికి 20 పరుగులే అవసరం కాగా, ఓపెనర్ అలెక్స్ కేరీ (9) వికెట్‌ను కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. 152 పరుగులు చేసి ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించిన ట్రావిస్ హెడ్‌కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
ఇక ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియన్ అరుదైన ఘనతను అందుకున్నాడు. టెస్టుల్లో 400 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ తొలి టెస్టులో ఈ అరుదైన మైలురాయిని అతను అందుకున్నాడు. డేవిడ్ మలన్‌ను ఔట్ చేయడంతో 34 ఏళ్ల నాథన్ లియన్ ఖాతాలో 400 వికెట్లు చేరాయి. ఆస్ట్రేలియా తరపున లియన్ 101వ టెస్టు ఆడుతున్నాడు. అయితే 400 వికెట్లు దాటిన క్రికెటర్లలో లియన్ 16వ బౌలర్ కావడం విశేషం.
స్కోరు బోర్డు
ఇంగ్లండ్ 147 & 297
ఆస్ట్రేలియా 425 & 20/1