కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించడంపై.. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ నీటి సరఫరా శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పందించారు. రైతుల సంక్షేమాన్ని మరిచి, కార్పోరేట్ సంస్థలకు అనుకూలంగా కేంద్రం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటాలు చేసిన రైతులకు అండగా సీఎం కేసీఆర్ నిలిచారని గుర్తుచేశారు. బీజేపీ ప్రభుత్వం మెడలు వంచి విజయాన్ని సాధించిన రైతులకు అభినందనలు తెలిపారు. పోరాటంలో అసువులు బాసిన రైతుల కుటుంబాలకు మంత్రి సంతాపం, సానుభూతిని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని అభివృద్ది చేస్తూ, రైతాంగానికి అండగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిలిచారని అన్నారు. కేంద్రం తీసుకొచ్చిన నల్ల చట్టాలను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న సీఎం కేసీఆర్ ఆదేశాలతో పార్లమెంట్‌లో నల్ల చట్టాలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు బైకాట్ చేశారని అన్నారు. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ రైతుల పక్షాన నిలబడేందుకు దేశవ్యాప్తంగా రైతులను ఏకం చేసేందుకు శ్రీకారం చుట్టి ధర్నాలు చేపట్టడంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దిగివచ్చిందన్నారు. రైతుల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ది చేస్తున్నారని అన్నారు. రైతుల కోసం రైతుబంధు, రైతు భీమా, సాగునీటి ప్రాజెక్టులను నిర్మించి రైతులకు అండగా ఉన్నారని అన్నారు.
నూతన చట్టాలను అమలు చేయాలని రాష్ట్రాలపై ఒత్తిడి తెచ్చినా.. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడానికి మన ముఖ్యమంత్రి కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకించి రైతాంగానికి అండగా నిలిచారని మంత్రి అన్నారు. అదే స్పూర్తితో తెలంగాణలో పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసే వరకు పోరాటం. వ్యవసాయం పట్ల పూర్తి అవగాహన కలిగిన నాయకుడు మనకు ముఖ్యమంత్రిగా ఉండటం తెలంగాణ ప్రజల అదృష్టమని అన్నారు. ఇప్పటికైనా బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు బుద్ది తెచ్చుకోని రైతు వ్యతిరేక నిర్ణయాలను వదిలి తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసే వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న పోరాటంలో కలిసి రావాలని మంత్రి ఎర్రబెల్లి సూచించారు.