తెలంగాణ రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంలలో ముందు వరుసలో ఉన్నదన్నారు రాష్ట్ర ఐటీ,పరిశమల మంత్రి కే.తారకరామారావు. ఈరోజు ఆయన హెచ్ఐసీసీలో జరిగిన ఇండో- ఫ్రెంచ్ ఇన్వెస్ట్మెంట్ కంక్లేవ్‌లో ఫ్రెంచ్ రాయబారి ఇమాన్యుల్ లేనైన్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంలలో ముందు వరుసలో ఉన్నది. పరిశ్రమలను, పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకురావడం కోసం తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అనేక విప్లవాత్మకమైన ప్రభుత్వ విధానాలను చేపట్టిందన్నారు.
టిఎస్ ఐపాస్ ద్వారా 15 రోజుల్లో అనుమతులు ఇస్తాం.. టీఎస్ ఐపాస్ విధానం ఇప్పటికే విజయవంతమై వేలాది పెట్టుబడులను, లక్షలాది ప్రత్యక్ష ఉద్యోగాలను తెలంగాణకు తీసుకొచ్చింది. ఇలాంటి విధానము భారతదేశంలోని ఏ రాష్ట్రంలో లేదు అని గర్వంగా చెప్పగలము. ప్రభుత్వాలు మారినా ప్రభుత్వ విధానాలు స్థిరంగా ఉండాలన్న స్ఫూర్తితో అనేక కార్యక్రమాలను, పాలనా సంస్కరణలను చేపట్టాము. ప్రభుత్వ పాలసీలే కాకుండా అనేక ఇతర అంశాల్లోనూ తెలంగాణ ఆదర్శవంతమైన పద్ధతులను అనుసరిస్తుందని కేటీఆర్ తెలిపారు.
భారత దేశాన్ని కేవలం కేంద్ర ప్రభుత్వ విధానాలను ఆధారంగా మాత్రమే చూస్తే సరిపోదు.. భారతదేశంలోని తెలంగాణ లాంటి రాష్ట్రాలను ఇక్కడి ప్రభుత్వ విధానాలు, పెట్టుబడి అవకాశాల దృక్కోణంతో చూడాలి. హైదరాబాద్ నగరం, ఏ రాష్ట్రం వారికైనా ప్రపంచంలోని ఏ దేశం వారికైనా నివసించేందుకు అత్యంత అనుకూలమైన మౌలిక వసతులతో పాటు సాంస్కృతిక సెటప్ ఉన్న నగరం. హైదరాబాద్‌లో ఉన్న అనేక రంగాల ఎకోసిస్టమ్‌ను ప్రత్యేకంగా ప్రస్తావించారు మంత్రి కేటీఆర్.
లైఫ్ సైన్సెస్ ఫార్మా రంగాలతోపాటు, ఐటి, ఇన్నోవేషన్, ఏరోస్పేస్ డిఫెన్స్ వంటి రంగాల్లో తెలంగాణ అద్భుతమైన ప్రగతిని సాధిస్తుంది. హైదరాబాద్ ప్రపంచవ్యాప్త వ్యాక్సిన్ క్యాపిటల్‌గా ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద టాప్ టెక్ కంపెనీల భారీ కార్యాలయాలకు హైదరాబాద్ కేంద్రంగా ఉంది. ఇప్పటికే అనేక ఫ్రెంచ్ కంపెనీలు తెలంగాణలో భారీ ఎత్తున తమ పెట్టుబడులను పెట్టి కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. ఇక్కడ తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఫ్రెంచ్ కంపెనీలు.. తెలంగాణ రాష్ట్ర విధానాలు, ఇక్కడ ఉన్న స్నేహపూర్వక వ్యాపార వాతావరణం పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు.
ఫ్రెంచ్ దేశానికి సంబంధించిన భారీ కంపెనీలతో పాటు మధ్య తరహా కంపెనీలను సైతం తెలంగాణ ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉంది. ఆయా కంపెనీల భవిష్యత్తు అభివృద్ధిలో భాగస్వామిగా ఉండేందుకు తెలంగాణ సిద్ధంగా ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చే కంపెనీకి అన్ని రకాలుగా సహకరిస్తాం. ఇతర దేశం లేదా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రతిపాదనలకు సమానంగా లేదా అంతకు మించి సహాయ సహకారాలను తెలంగాణ రాష్ట్రం అందిస్తుందని మంత్రి కేసీఆర్ తెలిపారు.
ఫ్రెంచ్ రాయబారి ఇమాన్యుల్ లేనైన్ మాట్లాడుతూ.. ఈరోజు నిర్వహిస్తున్న ఈ ఇన్వెస్ట్మెంట్ కాంక్లేవ్ ద్వారా తెలంగాణలోని పెట్టుబడి అవకాశాలను ఫ్రెంచ్ కంపెనీలు తెలుసుకునేందుకు అవకాశం కలుగుతుంది. ఇప్పటికే అనేక ఫ్రెంచ్ వ్యాపార వాణిజ్య వర్గాలు తెలంగాణలో కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. తెలంగాణలో తమ పెట్టుబడి అనుభవం పట్ల, ఇక్కడి స్నేహపూర్వక వాతావరణం పట్ల సంతృప్తిగా ఉన్నాయన్నారు.
ఇక్కడ ఉన్న ఇన్నోవేషన్ మరియు ఇతర రంగాల్లో అనేక అవకాశాలు ఉన్నాయి.. తెలంగాణ లోకి మరిన్ని పెట్టుబడులు వచ్చేలా మా వైపు నుంచి సహకారాన్ని అందిస్తాం. ఇందుకు సంబంధించి ఒక ప్రత్యేక భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం మరియు ఫ్రెంచ్ వ్యాపార వర్గాలతో కలసి పనిచేస్తామన్నారు. ఈ సమావేశానికి హాజరైన ఫ్రెంచ్ వ్యాపార వాణిజ్య రంగాలకు చెందిన ప్రతినిధులతో జరిగిన ఈ సమావేశంలో ప్రసంగించడానికి ముందు రాయబారితో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు.