దైవభూమి కేరళ శబరిమల యాత్ర మార్గదర్శకాలను విడుదల చేసింది కేరళ ప్రభుత్వం. ప్రతి ఏటా శబరిమల యాత్రను అంగరంగవైభవంగా నిర్వహిస్తుండగా లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. కరోనా కారణంగా భక్తుల సంఖ్యను కుదించగా తాజాగా కొత్త గైడ్‌లైన్స్‌ను విడుదల చేసింది.
నవంబర్ 16 నుంచి శబరిమల యాత్ర ప్రారంభం కానుండగా రోజుకు 25 వేల మంది భక్తులు అయ్యప్పను దర్శనం చేసుకునేందుకు వీలు కల్పించింది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది కేరళ ప్రభుత్వం.
రెండు టీకాలు వేయించుకున్నవారు లేదంటే ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో నెగెటివ్ వచ్చిన భక్తులకు మాత్రమే ఆలయంలోకి అనుమతించాలని నిర్ణయించగా దర్శనం అనంతరం సన్నిధానంలో ఎవరూ ఉండకుండా తిరిగి వెళ్లిపోయేలా ఎర్పాట్లు చేస్తున్నారు.
ఇక గత సంవత్సరం లాగానే యాత్రికులను ఎరుమేలి మీదుగా అటవీ మార్గంలో పుల్మేడు మీదుగా సన్నిధానానికి అనుమతించకూడదని సర్కార్ నిర్ణయం తీసుకుంది. నీలక్కల్ నుంచి భక్తులు కేరళ ప్రభుత్వ ఆర్టీసీ బస్సులను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది.