గ్రామ పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న నిధుల వినియోగం, ఖర్చు ఏ విధంగా ఉందనే విషయాలను తెలుసుకోవడానికి నిర్వహిస్తున్న ఆన్ లైన్ ఆడిటింగ్ లో మరోసారి మన తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలవడం పట్ల రాష్ట పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతోషం వ్యక్తం చేశారు. కేంద్ర 15వ ఆర్థిక సంఘం నిధులకు సమానంగా నిధులు ఇస్తున్న రాష్ట్రం ఒక్క తెలంగాణ తప్ప మరోటి దేశంలో లేదని, ఈ ఘనత మొత్తం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికే దక్కుతుందని ఆయన అన్నారు. ఆన్ లైన్ ఆడిటింగ్ లో మళ్ళీ మన రాష్ట్రమే నెంబర్ వన్ గా నిలిచిన నేపథ్యంలో మంత్రి ఎర్రబెల్లి ఒక ప్రకటన విడుదల చేశారు.
అన్ని గ్రామాలను ఆడిటింగ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం గత ఏడాది నిర్ణయించిందని, ఆ ఏడాది 25శాతం ఆడిటింగ్ జరిగినా చాలని కేంద్రం భావించిందని, అయితే, తెలంగాణలో మాత్రం 40శాతం గ్రామాల ఆడిటింగ్ ని అధికారులు పూర్తి చేశారని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. దీంతో దేశంలోని వివిధ రాష్ట్రాలు మన తెలంగాణకు వచ్చి ఆన్ లైన్ ఆడిటింగ్ ని అధ్యయనం చేసి వెళ్ళాయని మంత్రి చెప్పారు. అయినా కొన్ని రాష్ట్రాలు ఆడిటింగ్ ని కనీసం మొదలు పెట్టలేకపోయాయని, దీంతో కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించిందని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఆడిటింగ్ లో అనుసరించిన విధి విధానాలపై మన అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చించ్చారన్నారు. అయితే కరోనా ప్రభావం ఉన్నప్పటికీ, ఈ ఏడాది జూన్ లోనే ఆడిటింగ్ ని మొదలు పెట్టడం వల్ల కేవలం మూడు నెలల్లోనే 28శాతం ఆడిటింగ్ పూర్తి చేసి, దేశంలో మరోసారి మొదటి స్థానంలో నిలిచామని మంత్రి వివరించారు.
తండాలను సైతం పంచాయతీలుగా మార్చిన సీఎం కేసీఆర్ గారు, నిధులను క్రమం తప్పకుండా పంచాయతీలకు విడుదల చేస్తున్నారన్నారు. దీంతో ప్రతి చిన్న చిన్న గ్రామ పంచాయతీకి కూడా కనీస నిధులు సమకూరి అభివృద్ధికి ఆస్కారం ఏర్పడుతుందన్నారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం ద్వారా అభివృద్ధి పనుల నిర్ణయం, ఖర్చు స్వేచ్ఛను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా గ్రామ పంచాయతీలకే ఇవ్వడం, అలాగే, ఆయా పనులు ప్రయోజన కరంగా, నిధుల దుర్వినియోగం జరగకుండా, పారదర్శకంగా జరిగే విధంగా చూడటం వల్ల రాష్ట్రంలో స్థానిక పరిపాలన అద్భతంగా కొనసాగుతున్నదని మంత్రి ఎర్రబెల్లి వివరించారు. పల్లె ప్రగతి సాధించిన ఫలితాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. ఇదే క్రమంలో నిర్వహిస్తున్న ఆడిట్ లోనూ మన రాష్ట్రం దేశంలో నెంబర్ వన్ గా నిలవడం జరిగిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సీఎం కేసీఆర్ గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.