తెలంగాణలో టీఆర్ఎస్ తిరుగులేని రాజకీయ శక్తి- మంత్రి కొప్పుల

206
- Advertisement -

ఢిల్లీలో టిఆర్ఎస్ కార్యాలయం నిర్మాణానికి ముఖ్యమంత్రి కెసిఆర్ సెప్టెంబర్ 2న భూమి పూజ చేస్తున్న సందర్భంగా టిఆర్‌ఎస్‌ జెండా పండుగను విజయవంతం చేద్దాం.. వాడవాడలా గులాబీ జెండాలు ఎగురవేసి పార్టీ గొప్పతనాన్ని, కెసిఆర్ సుపరిపాలన గురించి గడప గడపకు వెళ్లి ప్రజలకు వివరించాల్సిందిగా జమ్మికుంట మునిసిపల్ కౌన్సిలర్లకు మంత్రి కొప్పుల ఈశ్వర్ దిశానిర్దేశం చేశారు. ఈరోజు ఆయన ప్రజాప్రతినిధులతో సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ.. తెలంగాణలో టిఆర్ఎస్ తిరుగులేని రాజకీయ శక్తి..ముఖ్యమంత్రి కెసిఆర్ ఎదురులేని మహానేత అని మంత్రి కొనియాడారు.

ఈ 20ఏండ్లలో పార్టీని గొప్పగా తీర్చిదిద్దారు కెసిఆర్. ఈ ఏడేళ్లలో తెలంగాణను అన్ని రంగాలలో ప్రగతిపథాన పరుగులు పెట్టిస్తూ దేశానికి దిక్సూచిని చేశారు.అసాధ్యాలను సుసాధ్యం చేశారు. కాళేశ్వరం వంటి అద్భుతమైన సాగునీటి ప్రాజెక్టును రికార్డు సమయంలో నిర్మింపజేశారు.కెసిఆర్ సుపరిపాలనలో జల విద్యుత్ హరిత శ్వేత నీలి గులాబీ పర్యాటక పారిశ్రామిక విప్లవాలు వచ్చాయన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి.ప్రజలందరి భద్రతకు ప్రాధాన్యతనిస్తున్న కెసిఆర్ గొప్ప లౌకిక వాది అన్నారు. పార్టీని స్థాపించిన కొద్ది కాలంలో బంజారాహిల్స్ వంటి ఖరీదైన చోట తెలంగాణ భవన్‌ను గొప్పగా నిర్మించారు.

ఇది పార్టీ కార్యకర్తలు, తెలంగాణ ప్రజలలో మరింత ఆత్మగౌరవాన్ని పెంచింది..ఇక రాష్ట్ర సాధన తథ్యమన్న ఆత్మ విశ్వాసం, స్థైర్యంతో ముందుకు సాగాం.ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో టిఆర్ఎస్ కార్యాలయాన్ని నిర్మించేందుకు భూమి పూజ చేస్తున్నారు. ఢిల్లీలో ఏ ఒక్క ప్రాంతీయ పార్టీకి కూడా సొంత భవనాలు లేవు. ఈ భవన నిర్మాణంతో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం మరింత పెరుగనుంది. ఈ సందర్బంగా మనమందరం వాడవాడలా గులాబీ జెండాలు ఎగురేద్దామన్నారు మంత్రి కొప్పుల. తెలంగాణ ప్రజల గుండె చప్పుడు గులాబీ జెండా, కెసిఆర్ సుపరిపాలన గురించి గడప గడపకు వెళ్లి వివరిద్దామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, మునిసిపల్ ఛైర్మన్ రాజేశ్వరరావు,టిఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షుడు రాజ్ కుమార్, టిఆర్ఎస్ నాయకులు మల్లయ్య,కోటి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -