ఇవాళ కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో పర్యటించనున్నారు సీఎం కేసీఆర్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకాన్ని ప్రారంభించనున్నారు. ముందుగా అర్హులైన 15 కుటుంబాలకు 10 లక్షల ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. హుజూరాబాద్‌లో సీఎం కేసీఆర్ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.
హుజూరాబాద్ నియోజక వర్గంలో ఐదు మండలాలు, రెండు మున్సిపాలిటీలున్నాయి. దళితబంధు కోసం ఒక్కో మండలానికి ఇద్దరిని ఎంపిక చేశారు. మున్సిపాలిటీల నుంచి ముగ్గురిని ఎంపిక చేశారు.
మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కేసీఆర్ సభ జరగనుంది. 100 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పుతో భారీ వేదిక ఏర్పాటు చేశారు. సభ ఏర్పాట్లను మంత్రి హరీష్‌రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పరిశీలించారు. దళిత బంధు కోసం ఇప్పటికే ప్రభుత్వం 500 కోట్ల నిధులను విడుదల చేసిన సంగతి తెలిసిందే.