బీజేపీ రైతు ద్రోహి..!

124
rnr
- Advertisement -

పీపుల్స్‌ స్టార్ట్ ఆర్‌. నారాయణ మూర్తి మరోసారి సీఎం కేసీఆర్ పై ప్రశంసలు జల్లు కురిపించారు. అలాగే బీజేపీ రైతు ద్రోహి అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. తాజాగా ఆర్‌. నారాయణ మూర్తి నటించి, నిర్మించిన “రైతన్న” చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది. ఈ సిన్మా ప్రమోషన్‌లో భాగంగా జరిగిన మీడియా సమావేశానికి ఆర్‌.నారాయణ మూర్తితో పాటు, తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్‌. నారాయణమూర్తి మాట్లాడుతూ.. . తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌‌పై, రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతుబంధు పథకంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రైతు బంధు పథకం చాలా అద్భుతమైనదని చెప్పిన నారాయణ మూర్తి.. ఈ పథకం అమలు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికే ఆదర్శంగా, దిక్సూచిగా నిలుస్తున్నారని కొనియాడారు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు వరాలు కావని, శాపాలుగా మారబోతున్నాయని పేర్కొంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎనిమిది నెలలుగా కేంద్ర ప్రభుత్వ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదని, ఇలాంటి చట్టాలు వర్ధమాన దేశమైన భారత దేశానికి అంత మంచివి కావంటూ ధ్వజమెత్తారు. కొత్త వ్యవసాయ చట్టాలు అమలయితే ఈ దేశంలో కూడా రైతు కూలీలే మిగులుతారని, స్వేచ్చా వాణిజ్యం పేరుతో రైతుల మెడకు ఉరి బిగించడం తగదని నారాయణమూర్తి కేంద్ర ప్రభుత్వంపై తనదైన స్టైల్లో ఫైర్ అయ్యారు.

‘అర్ధరాత్రి స్వాతంత్రం’ నుంచి మొదలుకొని అన్నదాత సుఖీభవ వరకు 36 సినిమాలు తీశానని, 37వ సినిమా ఈ ‘రైతన్న’ విడుదల చేస్తున్నానని అన్నారు. ఈ సమావేశంలో మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ…. రైతన్న సినిమాను అందరూ ఆదరించాలని కోరారు. సినిమా మాధ్యమం ద్వారా ప్రజల పక్షపాతి, రైతు పక్షపాతి, తెలుగు ప్రజలకు సుపరిచితుడు ఆర్ నారాయణ మూర్తి ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో మట్టికి, మనిషికి ఉన్న సంబంధాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు.రైతులు, ప్రజలు, మీడియాతోపాటు సమాజంలోని అందరూ ఈ రైతన్న సినిమాను ఆదరించాలని మంత్రి నిరంజన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు మొత్తంగా హుజూరాబాద్ ఉప ఎన్నికల వేళ నటుడు ఆర్‌.నారాయణ మూర్తి సీఎం కేసీఆర్‌ను ఆకాశానికి ఎత్తేస్తూ..బీజేపీ రైతు వ్యతిరేక విధానాలను తూర్పారపట్టడం తెలంగాణ బీజేపీకి షాకింగ్‌గా మారింది.

- Advertisement -