గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా దివ్యాంగులకు త్రిచక్ర వాహనాలను అందజేశారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ జలవిహార్‌లో ఆదివారం ఉదయం గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్….ఆత్మ సంతృప్తినిచ్చే కార్యక్రమాల్లో భాగంగానే గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.
రాజకీయాల్లో ఉన్నప్పుడు డబ్బులు ఎక్కువ ఖర్చు చేస్తుంటామన్నారు. ఒక్కోసారి అనవసర ఖర్చు కూడా చేయాల్సి వస్తుందన్నారు. బ్యానర్లు, హోర్డింగులు పెట్టి ఖర్చు చేస్తాం. దాన్ని తగ్గించుకోవాలన్నదే తన ఆలోచన అన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో వృథా ఖర్చులు పెట్టొద్దని గతేడాది తన పుట్టిన రోజు సందర్భంగా 100 అంబులెన్స్‌లు పంపిణీ చేసినట్లు చెప్పారు.
టీఆర్ఎస్ నేతలు సైతం స్వతహాగా ముందుకు వచ్చి ఇబ్బందుల్లో ఉన్నవారికి సాయం చేస్తున్నారన్నారు. త్రిచక్ర వాహనం దివ్యాంగుల జీవనోపాధికి ఉపయోగపడుతుందని మంత్రి వెల్లడించారు.