ఆదివారం (25 జూలై) నవరస నటనా సార్వభౌముడు కైకాల సత్య నారాయణ పుట్టినరోజు. కైకాల 86వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి – సురేఖ దంపతులు జూబ్లీహిల్స్ లోని ఆయన ఇంటికి వెళ్లి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. కైకాలతో చాలా సేపు ముచ్చట్లాడారు. తమ కెరీర్ జర్నీలో ఎన్నో మెమరీస్ ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ విషయాన్ని చిరంజీవి ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
తెలుగు సినిమా ఆణిముత్యం, నవరస నటనా సార్వభౌముడు అంటూ కొనియాడారు. కైకాల సత్యనారాయణ తనకు ఎంతో ఆప్తుడని వెల్లడించారు. ఇవాళ సతీసమేతంగా ఆయన ఇంటికి వెళ్లి స్వయంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి, ఆయనతో కాసేపు ముచ్చటించడం ఓ మధురమైన అనుభూతి అని చిరంజీవి తెలిపారు.
కైకాల ప్రస్తుతం తన విశ్రాంత సమయాన్ని ఇంట్లోనే గడుపుతున్నారు. ఆయన జూబ్లీహిల్స్ లోని జర్నలిస్ట్ కాలనీలో కుటుంబంతో నివాసం ఉంటున్నారు. ఇటీవల కేజీఎఫ్ చాప్టర్ 1 కి ఆయన సమర్పకులుగా కొనసాగిన సంగతి తెలిసిందే. ప్రతిష్ఠాత్మక హోంబలే ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మించగా కైకాల సత్యనారాయణ సమర్పకులుగా కొనసాగారు. తెలుగులోనూ కేజీఎఫ్ విజయం సాధించింది. త్వరలోనే సీక్వెల్ రిలీజ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసినదే.