వరంగల్ ప్రజలకు ఇవాళ సుదినం.. కేసీఆర్ మనకు సీఎం కావడం మనం ఒక అదృష్టంగా భావించాలి అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించిన సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడారు. వరంగల్ జిల్లా ప్రజల మనసులో ఏముందో సీఎం కేసీఆర్‌కు తెలుసు. ఈ జిల్లా అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు.
మహారాష్ట్రాలో అక్రమ ప్రాజెక్టులు కట్టి వరంగల్ జిల్లాకు నీళ్లు రావు అనుకున్నాం. కానీ కాళేశ్వరం ద్వారా దేవాదులకు సాగునీరు అందిస్తున్నారు. రైతుల తరపున పాదాభివందనం చేస్తున్నాను. రైతుల కోసం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. గ్రామాలు బాగు చేసేందుకు సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. గ్రామాల రూపురేఖలు మారిపోయాయి.
సీఎం కేసీఆర్ ఆశయాల మేరకు వరంగల్ పట్టణాన్ని తీర్చిదిద్దుతామని చెప్పారు. వరంగల్ ఎంజీఎంను అభివృద్ధి చేస్తున్నారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి భూమిపూజ చేయడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఈ హాస్పిటల్ పూర్తయితే సమీప జిల్లాల ప్రజలకు ఎంతో మేలు జరిగే అవకాశం ఉందన్నారు. ఒకప్పుడు ఆఫీసుల చుట్టూ తిరగలేక సచ్చేది. కానీ నేడు అన్ని కార్యాలయాలు ఒకే వద్ద నిర్మించడం గొప్ప విషయమన్నారు ఎర్రబెల్లి దయాకర్ రావు.