సీనియర్ నటుడు చంద్రశేఖర్ ఇకలేరు..

287
Actor Chandrashekhar
- Advertisement -

సీనియర్‌ బాలీవుడ్‌ న‌టుడు చంద్ర శేఖర్ (98) క‌న్నుమూశారు. దర్శకుడిగా, నిర్మాతగా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన చంద్ర‌శేఖర్ వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో బుధవారం ఉదయం స్వగృహంలోనే తుది శ్వాస విడిచారు. కుటుంబసభ్యులందరూ ఇంట్లో ఉన్న సమయంలోనే నిద్రలోనే ఆయన కన్నుమూశారని చంద్ర శేఖర్ త‌న‌యుడు, నిర్మాత అశోక్ శేఖర్ తెలిపారు. ఇలాంటి సుఖమైన మరణాన్నే ఆయన కోరుకున్నారని చెప్పారు. నాన్నకు ఎలాంటి అనారోగ్యం లేదని… బతికినన్నాళ్లు ఆరోగ్యంగా బతికారని తెలిపారు. ముంబై జుహులోని హాన్స్ క్రెమటోరియంలో ఆయన అంత్యక్రియలు ఈ సాయంత్రం జరగనున్నాయన్నారు.

1923లో హైదరాబాద్‌లో పుట్టిన చంద్రశేఖర్ నటనపై ఉన్న మక్కువతో 1950లో జూనియర్ ఆర్టిస్ట్‌గా మారారు. ఆ తర్వాత ‘సురంగ్’ అనే చిత్రంతో కథానాయకుడిగా పరిచయమయ్యారు. ‘కవి’, ‘మస్తానా’, ‘బసంత్ బహార్‌’, ‘కాలీ టోపీ లాల్ రుమాల్’, ‘గేట్ ఆఫ్ ఇండియా’, ‘ఫ్యాషన్‌’, ‘ధర్మ’, ‘డ్యాన్స్ డ్యాన్స్‌’, ‘లవ్ లవ్ లవ్’ తదితర సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించి మెప్పించారు. 250కిపైగా చిత్రాల్లో చంద్రశేఖర్ కనిపించారు.

1964లో స్వీయ నిర్మాణంలో ‘ఛ ఛ ఛ’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. 1966లో ‘స్ట్రీట్ సింగర్’ అనే సినిమాని తెరకెక్కించారు. 1970ల్లో ‘పరిచయ్‌’, ‘కౌశిష్’, ‘ఖుష్బూ’, ‘మౌసమ్’ తదితర సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ పనిచేశారు. రామానంద్ సాగర్ దర్శకత్వంలో రూపొందిన ‘రామాయణ్ సీరియల్‌తో (డీడీ ఛానల్‌) విశేష ప్రేక్షకాదరణ పొందారు. అందులో ఆర్య సుమంత్ అనే పాత్ర పోషించారు. కాగా, చంద్రశేఖర్‌కు ముగ్గురు కుమారులు ఉన్నారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

- Advertisement -