వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కళాశాల ఆవరణలో నూతనంగా 150 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఔట్ పేషంట్ సేవలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ నీటి సరఫరా శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇటీవల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని సందర్శించి తక్షణమే వైద్య సేవలు ప్రారంభించాలని ఆదేశించారు. అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సంధర్భంగా ఎంజిఎం ఆసుపత్రిని పూర్తి స్థాయిలో కోవిడ్ బాధితుల చికిత్స కోసం వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. నాన్ కోవిడ్ రోగులకు కేఎంసిలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.
దీనితో నాన్ కోవిడ్ వైద్య సేవలు అందించేందుకు వైద్య అధికారులు చర్యలు చేపట్టి 9 విభాగాలలో ఓపి సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. కేఎంసి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో పని చేయడానికి డాక్టర్లను, పారా మెడికల్, సాంకేతిక సిబ్బంది ఎంపిక ప్రక్రీయ కొనసాగుతుంది. అందులో భాగంగా ముగ్గురు సివిల్ సర్జన్‌లు, ఆర్‌యంఓలు, 16 మంది సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు, 7 మంది బ్రాడ్ స్పెషాలిటీ నిపుణులు, 134 మంది స్టాఫ్ నర్సుల ఎంపిక పూర్తయిందని కేయంసి ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యారాణి తెలిపారు. సెక్యూరిటి స్టాఫ్, సానిటేషన్ వర్కర్లు, సూపర్ వైజర్లు ఎంపిక ప్రక్రీయ త్వరలోనే పూర్తి చేయబడుతుందని తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ వల్ల కేఎంసి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో రోగులకు కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పించడంతోపాటు డాక్టర్లు, పారామెడికల్, స్టాఫ్ నర్సుల ఎంపిక చేపట్టడం జరిగిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. కార్డియాలజీ, కార్డియోథోరాసిక్ సర్జరీ, నెఫ్రాలజీ, యురాలజీ, గాస్ట్రో ఎంటరాలజీ, పెడియాట్రిక్ సర్జరీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, రెడియాలజీ విభాగాల ఔట్ పేషంట్ల సేవలు అందుబాటులోకి వచ్చాయని మంత్రి తెలిపారు. ప్రస్తుత కరోన పరిస్థితులలో నాన్ కోవిడ్ చికిత్స కోసం ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు మంత్రి తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు సమీప జిల్లాలోని ప్రజలకు ఉచితంగా అత్యున్నత వైద్య సేవలు అందుబాటులోకి వచ్చినట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. అందువల్ల ప్రతి ఒక్కరు ఈ ఆసుపత్రిలో వైద్య సేవలను వినియోగించుకోవాలని ఆయన కోరారు. కేఎంసి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌కు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు, ప్రభుత్వానికి ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.