జయలలిత నెచ్చెలిగా విలాసవంతమైన జీవితం.. చుట్టు పది మంది పనిమనుషులు, ఏసీ రూం, లగ్జరీ కార్లు. అమ్మతో సమానంగా చిన్నమ్మ రాజమర్యాదలు అందుకుంది. కానీ ఓడలు బండ్లవుతాయన్న చందంగా కట్ చేస్తే సీన్ రీవర్సైంది. ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు వంగివంగి దండాలు పెట్టారు. ఇదంతా గతం. ప్రస్తుతం చిన్నమ్మ పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
ప్రైవేటు సెల్, ఫ్యాన్, ఇంగ్లీషు, తమిళ వార్తా పత్రికలు అన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు ఆ రాజభోగాలన్నీ పోయాయి. సర్వసాధారణంగానే ఇతర ఖైదీల్లాగే మామూలు సెల్లో ఆమె ఉండాలి. ఆమెతోపాటు మరో ఇద్దరు మహిళలు కూడా అదే సెల్లో ఉంటారు. ఇందులో సర్వసాధారణ సదుపాయాలు మాత్రమే ఉంటాయి. ఏమాత్రం ప్రైవసీ ఉండదు. తెల్లవారుజామున లేస్తే తప్ప టాయిలెట్లను వాడటం అంత ఈజీ కాదు. ఒక గంట తర్వాత రోజంతా అవి కంపు కొడుతూనే ఉంటాయి. ఖైదీలందరికీ తెల్లటి యూనిఫాం తప్పనిసరి. ఇది ముఖ్యమంత్రి కావాల్సిన 61 ఏళ్ల చిన్నమ్మ తాజా పరిస్ధితి.
అవమానాలు, ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొని బెంగళూరు పరప్పణ అగ్రహార జైలు కోర్టులో లొంగిపోయారు. ఆమెకు ఖైదీ నెంబర్ 9234 కేటాయించారు. మూడున్నరేళ్లు జైలులో చిన్నమ్మ శిక్ష అనుభవించాలి. ఈ శిక్షా కాలంలో ఓ రోజు భారంగా గడిచింది. బుధవారం జైలుకు వెళ్లిన శశికళ.. తొలిరోజు రాత్రి నేలపైనే పడుకున్నారు. జైలు సిబ్బంది ఆమెకు ఓ దుప్పటి, దిండు, ఫ్యాన్, బెడ్ షీట్ ఇచ్చారు. తనను ప్రత్యేక ఖైదీగా పరిగణించాలని శశికళ చేసిన విన్నపాన్ని కోర్టు తోసిపుచ్చింది. ఏసీ, టీవీ, ఇంటి భోజనం, మినరల్ వాటర్, వారానికోసారి నాన్ వెజ్ కావాలన్న కోరికను మన్నించలేదు. దీంతో జైలు సిబ్బంది ఆమెను సాధారణ ఖైదీగానే పరిగణిస్తున్నారు. ఆమెకు ఓ గది కేటాయించారు.
అయితే, దాదాపు 40 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పరప్పణ అగ్రహార జైలు శశికళకు కొత్తేమీ కాదు గానీ, అక్కడ దాదాపు నాలుగేళ్లు ఉండటం మాత్రం అంత సులభం కాదు. 2014 సంవత్సరంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితతో పాటు దోషిగా తేలి ఇక్కడకు వచ్చిన అనుభవం ఆమెకు ఉంది. కానీ ఇప్పుడు ఆమె ఒక సాధారణ ఖైదీగా మాత్రమే ఈ జైల్లో ఉండాల్సి వస్తుంది. జయలలితతో కలిసి ఉన్నప్పుడు ఆమెకు కూడా స్పెషల్ హోదా లభించింది.
ఇక పరప్పణ అగ్రహార జైలుకు దాదాపు మూడేళ్ల నుంచి సున్నం కూడా వేయలేదు. కొత్తగా వచ్చినవాళ్లయితే ఈ జైలు చూసి భయపడటం ఖాయం. దాదాపుగా పెద్దగోడలున్న ఓ మురికివాడలాగే ఉంటుందని అంటారు. బ్యారక్లలో ఉన్న టాయిలెట్లకు ఒక గంట పాటు మాత్రమే నీళ్లు వస్తాయి. అదే స్పెషల్ సెల్లకు అయితే అక్కడి బాత్రూంలలో ఎప్పుడూ నీళ్లు వస్తూనే ఉంటాయి. తాను జైలు నుంచే పార్టీ కోసం పనిచేస్తానని శశికళ చెప్పారు గానీ, అది అంత సులభం కాదు. ఎందుకంటే ఆమె ఇక్కడ కిచెన్లో గానీ, బేకరీలో గానీ, చెక్క పని గానీ చేయాల్సి ఉంటుంది.
జైలు శిక్ష అనుభవించే కాలంలో శశికళ కొవ్వొత్తులు తయారు చేసే పనిని ఎంచుకున్నారు. క్యాండిల్స్ తయారు చేసినందుకు ఆమెకు రోజుకు 50 రూపాయలు వేతనం ఇవ్వనున్నారు. వచ్చే ఆదివారం నుంచి ఆమెకు జైలు అధికారులు పనిని అప్పగించనున్నారు.