ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో క‌రోనా బాధితుల‌కు మెరుగైన వైద్యం..

169
minister errabelli
- Advertisement -

హైద్రాబాద్ తర్వాత అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న వ‌రంగ‌ల్ న‌గ‌రంపై సిఎం కేసిఆర్ ప్ర‌త్యేక శ్ర‌ద్ద చూపుతున్నార‌ని, అందుకు అనుగుణంగా న‌గ‌రంలోని ఎంజిఎం ఆసుప‌త్రిని అభివృద్ది చేసేందుకు కృషి చేస్తూనే, కోవిడ్ వ్యాప్తి నేప‌థ్యంలో క‌రోనా భారిన‌ప‌డ్డ బాధితుల‌కు చికిత్స అందించ‌డానికి అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా శాఖామంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌ రావు అన్నారు. సోమ‌వారం వ‌రంగ‌ల్ అర్భ‌న్ క‌లెక్ట‌రేట్ స‌మావేశ మందిరంలో వ‌రంగ‌ల్ అర్భ‌న్‌, రూర‌ల్ జిల్లాల్లో కోవిడ్ బాధితుల‌కు అందుతున్న చికిత్స‌, ఏర్పాట్ల‌పై జిల్లా అధికారులు, జిల్లా వైద్యాధికారులు, ఎంజిఎం ఆసుప‌త్రి అధికారుల‌తో మంత్రి స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు.

కోవిడ్ చికిత్స‌కు అవ‌స‌ర‌మైన రెమిడిసివీర్ ఇంజ‌క్ష‌న్లు, ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా జ‌రిగే విధంగా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని, ప్ర‌జ‌లు ఆందోళ‌న‌ల‌కు గురికావ‌ద్ద‌ని సూచించారు. ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల‌తో పాటు, ప్రైవేటు ఆసుప‌త్రులకు కూడా అన్ని వ‌స‌తులు స‌మ‌కూర్చుతున్న‌ట్లు చెప్పారు. ప్రైవేటు ఆసుప‌త్రుల్లో చికిత్స పొందుతున్న‌వారు కూడా మ‌న పౌరులే కాబ‌ట్టి ప్ర‌తి ఒక్క‌రికి చికిత్స అందించాల‌న్న ల‌క్ష్యంతో ప్ర‌భుత్వం కృషి చేస్తుంద‌ని అన్నారు. వ‌రంగ‌ల్ ఎంజిఎం అసుప‌త్రిలో కోవిడ్ చికిత్స కోసం 800 ప‌డ‌క‌ల‌ను సిద్దంగా ఉన్నాయ‌ని, 650 ప‌డ‌క‌లు ఆక్సిజ‌న్ తో కూడిన‌వి కాగా, 80 వెంటిలెట‌ర్స్ ప‌డ‌క‌లు ఉన్నాయ‌ని మంత్రి చెప్పారు. ప్ర‌జ‌ల‌ను కాపాడుకునేందుకు ఎంజిఎం ఆసుప‌త్రితో పాటు ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలోని పి.హెచ్‌.సిల‌కు కావాల్సిన‌ అన్ని స‌దుపాయాలు క‌ల్పించేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్ నిధులు విడుద‌ల చేశార‌ని తెలిపారు.

ప్ర‌భుత్వం చేస్తున్న ప్ర‌యత్నానికి వైద్యులు, ప్ర‌జ‌లు స‌హ‌క‌రించాల‌ని మంత్రి కోరారు. ఎంజిఎం ఆసుప‌త్రిలో ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్ కోసం ప్ర‌త్యేక వార్డుల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు. కోవిడ్ చికిత్స‌కు అవ‌స‌ర‌మైన వైద్యులు, సిబ్బంది, పారామెడిక‌ల్ సిబ్బంది, ల్యాబ్ టెక్నిషియ‌న్‌ల‌ నియామ‌కానికి వెంట‌నే చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని మంత్రి ఆదేశించారు. ఎంజిఎం ఆసుప‌త్రిని పూర్తి స్థాయిలో కోవిడ్ చికిత్స‌కు వినియోగించుకుంటూనే, ముందస్తుగా న‌గ‌రంలోని ప్ర‌భుత్వ‌, ప్రైవేటు ఆసుప‌త్రుల‌ను గుర్తించి వాటిలోని బెడ్స్ సామ‌ర్ధ్యం, కావాల్సిన స‌దుపాయాల‌ను ఏర్పాటు చేసేందుకు ప్ర‌త్యేక క‌మిటీ వేసి నివేధిక అంద‌జేయాల‌ని క‌లెక్ట‌ర్‌ను మంత్రి ఎర్రబెల్లి ఆదేశించారు.

ఎంజిఎం ఆసుప్ర‌తి హెల్ప్ లైన్‌ ఏర్పాటు..

వ‌రంగ‌ల్ ఎంజిఎం ఆసుప‌త్రిలో బెడ్స్ సౌల‌భ్యం, కోవిడ్ బాధితుల‌కు అవ‌స‌ర‌మైన స‌మాచారం అందించ‌డానికి హెల్ప్ లైన్ ఏర్పాటు చేసిన‌ట్లు మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. హెల్ఫ్‌లైన్‌ నెంబర్ 7901618231 నంబ‌ర్ లో సిబ్బంది ఎప్ప‌టిక‌ప్పుడు స‌మాచారం తెలియ‌జేయ‌డానికి నిరంతరం అందుబాటులో ఉంటార‌ని ఆయన అన్నారు. KMC సూపర్ స్పెషాలిటీ ఆసుప‌త్రిలో సౌక‌ర్యాల క‌ల్ప‌న‌కు రాష్ట్ర ప్రభుత్వం 8 కోట్లు విడుదల చేసిందని మంత్రి తెలిపారు. 250 బెడ్స్ తో నాన్ కోవిడ్ చికిత్స‌ల‌ను అందిస్తున్న‌ట్లు చెప్పారు. 363 మంది డాక్టర్లు, ఇతర సిబ్బంది నియామకం 15 రోజుల్లోగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించార‌ని మంత్రి ఎర్ర‌బెల్లి చెప్పారు. అన్ని మండల‌కేంద్రాలలో కరోనా పేషేంట్స్ కోసం ఐసోలేష‌న్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు. అందుకు ధాత‌లు ముందుకు వ‌చ్చి బాధితుల‌కు భ‌రోసా క‌ల్పించాలని విజ్ఞ‌ప్తి చేశారు. క‌రోనా క‌ట్ట‌డికి ప్ర‌తి ఒక్క‌రూ స‌హ‌కరించాల‌న్నారు.

వరంగల్ సెంట్రల్ జైలును త‌ర‌లించి, ఆసుప‌త్రి నిర్మాణానికి చ‌ర్య‌లు..

వ‌రంగ‌ల్ సెంట్ర‌ల్ జైలును ధ‌ర్మ‌సాగ‌ర్‌కు త‌ర‌లించి, ఏడాది వ్యవధిలో కొత్త సెంట్రల్ జైల్ నిర్మాణం పూర్తి చేయ‌నున్న‌ట్లు మంత్రి చెప్పారు. ప్రస్తుతం వరంగల్ సెంట్రల్ జైల్ ఉన్న 76 ఎకరాల స్థలంలో అత్యాధునిక టెక్నాలజీతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం చేపట్టాలని సీఎం ఆదేశించార‌ని అన్నారు. వ‌రంగ‌ల్ న‌గ‌రంలో ఇంటింటి స‌ర్వే ద్వారా ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం క‌ల్పించాల‌ని, అందుకు ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మైన మందుల‌ను పిహెచ్‌సిలు, స‌బ్‌-సెంట‌ర్ల‌లో ఏర్పాటు చేయాల‌ని సూచించారు. మున్సిప‌ల్ కార్పోరేష‌న్‌, జిల్లా అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేసి కోవిడ్ వ్యాప్తి నివార‌ణ‌కు కృషి చేయాల‌ని పిలుపునిచ్చారు.

ఈ స‌మీక్షా స‌మావేశంలో ప్ర‌భుత్వ విప్ ధాస్యం విన‌య్‌భాస్క‌ర్‌, మేయ‌ర్ గుండు సుధారాణి, ఎమ్పీలు బండా ప్ర‌కాశ్‌, ప‌సునూరి ద‌యాక‌ర్‌, ఎమ్మెల్యేలు డా.టి.రాజ‌య్య‌, పెద్ది సుధ‌ర్శ‌న్‌రెడ్డి, నన్న‌పునేని న‌రెంద‌ర్‌, క‌లెక్ట‌ర్లు రాజీవ్‌గాంధీ హ‌న్మంతు, హ‌రిత‌ల‌తో పాటు, జిల్లా అధికారులు, ప్రైవేటు ఆసుప‌త్రుల యాజ‌మాన్యాలు త‌దిత‌రులు పాల్గొన్నారు.

- Advertisement -