దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రరూపం దాల్చుతోంది. ఓ వైపు కరోనా కేసులతో ప్రజలు భయాందోళనకు గురవుతుంటే మరోవైపు ఆక్సిజన్ అందక వందల సంఖ్యలో ప్రాణాలు కొల్పోతున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌కు ఆస్ట్రాజెనెకా, ఇతర కొవిడ్ వ్యాక్సిన్లను పంపించాలని అమెరికాలోని బైడెన్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది.
కరోనా మహమ్మారితో విలవిల్లాడుతున్న ఇండియా, బ్రెజిల్‌లాంటి దేశాలకు స్టోరేజ్‌లో ఉన్న కోట్లాది వ్యాక్సిన్ డోసులను పంపించాలని యూఎస్ చాంబర్ డిమాండ్ చేస్తోంది. కొవిడ్‌కు వ్యతిరేక పోరాటంలో అంతర్జాతీయ సమాజం మద్దతు కావాలని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కోరిన తర్వాత యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకటన విడుదల చేసింది.
ఇండియా ప్రపంచానికి సాయం చేస్తుందని, అందువల్ల ఇండియాకు కచ్చితంగా సాయం చేయాల్సిందే అని జైశంకర్ కోరారు. ఇండియాకు అత్యవసరమైన మందులను సరఫరా చేయడంలో ఉన్న అడ్డంకులను తొలగిస్తామని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జెలీనా పోర్టర్ చెప్పారు.