దేశంలో కరోనా టీకాల కొరతకు కేంద్రమే కారణమని ఆరోపించారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. కరోనా ఉదృతి నేపథ్యంలో స్పందించిన ప్రియాంక….కోవిడ్ కట్టడిలో కేంద్రం విఫలమైందని ఆరోపించారు. కరోనా బారిన పడ్డ ప్రజలు ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్నారని…. ఆక్సిజన్, బెడ్లు, మెడిసిన్స్ కోసం రోగులు ఎదురుచూస్తుంటే.. అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు మాత్రం ఎన్నికల ర్యాలీల్లో బిజీగా గడుపుతున్నారని ఎద్దేవా చేశారు.
ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యంలో ప్రపంచంలోనే భారత్‌ది అగ్రస్థానం అయినప్పటికీ, కొరత ఎదుర్కొంటున్నాం. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రణాళిక లోపమే అన్నింటికీ కారణమని ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో జోకులు, నవ్వులు ఆపి కరోనాతో పోరాడుతున్న ప్రజల వద్దకు మోదీ రావాలన్నారు. దేశం మహమ్మారిని ఎదుర్కొంటున్నప్పుడు ప్రతిపక్షాల సలహాలు స్వీకరించాలని కోరారు ప్రియాంక.