వరంగల్ నగరంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… ఎన్నిక ఏదైనా, సందర్భం ఏదైనా కేసీఆర్ తమ నాయకుడు అని భారీగా ప్రజలు తరలివచ్చినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వరంగల్ ప్రజల ఆశీర్వాదం సీఎం కేసీఆర్‌కు ఉండాలన్నారు. వరంగల్ పట్టణ అభివృద్ధి కోసం సంవత్సరానికి రూ. 300 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. ఒక్క మంచినీటి కోసం రూ. 1,580 కోట్లు ఖర్చు పెట్టుకున్నామని తెలిపారు. పట్టణంలోని ప్రజల దాహార్తిని తీర్చేందుకు రాంపూర్ వద్ద మిషన్ భగీరథ వాటర్ ట్యాంకును ప్రారంభించుకున్నామని తెలిపారు. రూపాయికే నల్లా కనెక్షన్ ఇస్తామన్నారు.
వరంగల్ నగరాన్ని అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దే బాధ్యత తమది అని స్పష్టం చేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టారని, చిత్తశుద్ధితో ఉన్నారని పేర్కొన్నారు. ఎన్నిక ఏదైనా కేసీఆరే మా నాయకుడు అని ఇప్పటి వరకు ఎలా తీర్పు ఇచ్చారో.. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఆ రకమైన తీర్పును ఇవ్వాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కరోనా సంక్షోభం వల్ల రాష్ట్ర ఆదాయం కూడా తగ్గిందన్నారు. కానీ సంక్షేమ పథకాలను ఎక్కడా ఆపకుండా.. అమలు చేస్తున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు.
- ఆసరా పెన్షన్లతో పేదల ముఖాల్లో సంతోషం
తెలంగాణ రాష్ట్రంలో పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. పెన్షన్ల విషయానికి వస్తే.. టీడీపీ హయాంలో రూ. 75 అయితే, కాంగ్రెస్ హయాంలో రూ. 200 ఇచ్చారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ. 2016 ఇస్తున్నాము అని తెలిపారు. ఆసరా పెన్షన్లతో పేదల ముఖాల్లో చిరునవ్వును, సంతోషాన్ని చూస్తున్నామని చెప్పారు. రాష్ర్టంలో 40 లక్షల మందికి పెన్షన్లు అందుతున్నాయి. వికలాంగులకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 500 ఇస్తే.. ఇప్పుడు రూ. 3016 ఇస్తున్నామన్నారు. ఒకనాడు ఇంట్లో ఎంత మంది ఉన్నా.. 20 కిలోల బియ్యం మాత్రమే ఇచ్చేవారు. కానీ తమ ప్రభుత్వం పేదలకు కడుపునిండా అన్నం పెట్టాలనే ఉద్దేశంతో ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున రేషన్ బియ్యం ఇస్తున్నాం. ఇది పేదల ప్రభుత్వం. ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అని కేటీఆర్ పేర్కొన్నారు. - తగ్గిన మాతా, శిశు మరణాలు
గర్భిణి స్త్రీలకు పౌష్టికాహారాన్ని అందజేస్తూ ఆడపిల్లలు పుడితే రూ. 13 వేలు, మగబిడ్డ పుడితే రూ. 12 వేలు అందజేస్తున్నామని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో సర్కారు ఆస్పత్రుల్లో నాణ్యమైన సేవలు అందుతున్నాయి. మాతా, శిశు మరణాలు గణనీయంగా తగ్గాయన్నారు.
ప్రభుత్వ హాస్టళ్లలో చదివే విద్యార్థులకు సన్న బియ్యంతో కూడిన నాణ్యమైన భోజనం అందిస్తున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామన్నారు. వెయ్యికి చేరువలో గురుకుల పాఠశాలలు నెలకొల్పి 4 లక్షల 50 వేల మంది నాణ్యమైన విద్యను అందిస్తున్నామని స్పష్టం చేశారు. ఒక్కో విద్యార్థి, విద్యార్థిని మీద సంవత్సరానికి రూ. లక్షా 20 వేలు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. విద్యార్థుల ఉన్నత విద్య కోసం ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లు అందిస్తున్నామని గుర్తు చేశారు.కరెంట్ కష్టాలను అధిగమించాం. ఎండాకాలం వచ్చిందంటే ఆరు నుంచి ఏడు గంటలు పవర్ కట్ ఉంటుండే. కేసీఆర్ సీఎం అయ్యాక ఒక్క సెకను కూడా కరెంట్ పోవట్లేదు అని స్పష్టం చేశారు.
- తెలంగాణకు బీజేపీ మొండి చెయ్యి
వరంగల్ అభివృద్ధికి బీజేపీ చేసిందేమీ లేదన్నారు. నల్లధనం తీసుకొచ్చి పేదల ఖాతాల్లో రూ. 15 లక్షలు జమ చేస్తామన్న ప్రధాని మోదీ మాట ఏమైందని కేటీఆర్ ప్రశ్నించారు. రాష్‌ర్టం కొత్తగా ఏర్పడినప్పుడు కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామన్నారు. కానీ ఇవ్వలేదు. తెలంగాణకు బీజేపీ మొండి చెయ్యి చూపిస్తుందన్నారు. మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు రూ. 440 ఉంటే ఇవాళ సిలిండర్ ధర రూ. 1000కి వచ్చిందన్నారు. ఇవి మంచి రోజులు కాదు.. చచ్చే రోజులు అని కేటీఆర్ విమర్శించారు. మోదీ హయాంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో కూరగాయల ధరలు కూడా పెరిగాయన్నారు. రైతులకు ఎరువుల ధరలు కూడా పెంచారు. కేంద్రానికి గత ఆరేండ్లలో రూ. 2 లక్షల 73 వేల కోట్లు పన్నుల రూపంలో చెల్లించాం. మనకు కేంద్రం ఇచ్చింది రూ. లక్షా 40 వేల కోట్లు మాత్రమే అని కేటీఆర్ స్పష్టం చేశారు.