కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయడంతో ఇబ్బందులు ఎదుర్కుంటున్న గుర్తింపు పొందిన ప్రయివేట్ విద్యాసంస్థల ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి రూ. 2000 ఆపత్కాల ఆర్ధిక సాయంతో పాటు కుటుంబానికి 25 కేజీల బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా ఉచితంగా సరఫరా చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇందుకు సంబంధించి ప్రయివేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది తమ బ్యాంకు అకౌంటు, వివరాలతో స్థానిక జిల్లా కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుందని సిఎం తెలిపారు.
శుక్రవారం ఉదయం 11-30 గంటలకు బీఆర్కె భవన్‌లో ఇందుకు సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ను ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ వీడియో కాన్పరెన్సులో అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు విద్యాశాఖ డిఈవోలు పౌరసరఫరాల శాఖ డిఎస్‌వో లు ఇతర సిబ్బంది పాల్గొంటారు. ఇందుకు సంబంధించి విధి విధానాలను, కార్యాచరణ ప్రణాళిక అమలు కోసం ఆదేశాలు జారీ చేయనున్నారు.
ప్రయివేటు విద్యాసంస్థల ఉపాధ్యాయులు ఇతర సిబ్బంది కుటుంబాలను మానవీయ దృక్ఫథంతో ఆదుకోవాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో గుర్తింపు పొందిన ప్రయివేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న దాదాపు 1 లక్షా 50 వేల మంది ఉపాధ్యాయులు ఇతర సిబ్బంది కి లబ్ధిచేకూరుతుంది.