జయలలిత అక్రమాస్తుల కేసులో ఏ-2 ముద్దాయిగా ఉన్న శశికళ దోషేనని సుప్రీంకోర్టు ప్రకటించింది. వారికి శిక్ష విధించాల్సిందేనని కోర్టు అభిప్రాయపడింది. జస్టిస్ పినాకి చంద్రఘోష్ తీర్పును చదువుతూ, ఈ కేసు తీవ్రమైనదని వ్యాఖ్యానించారు. చట్టాన్ని మీరి ప్రవర్తించినట్టు స్పష్టమవుతోందని అన్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జయ,శశికళతో పాటు మిగిలిన నలుగురు నిందితులంతా దోషులేనని ఆయన తన తీర్పులో పేర్కొన్నారు.
చిన్నమ్మకు నాలుగు సంవత్సరాల జైలు శిక్షతో పాటు పదికోట్లు జరిమాన విధిస్తూ దేశ అత్యున్నత న్యాయ స్థానం తీర్పు వెల్లడించింది. మరి కొద్దిసేపట్లో శశికళను అరెస్ట్ చేసే అవకాశలు ఉన్నాయి. చిన్నమ్మ సీఎం పదవిపై పెట్టుకున్న ఆశలు ఆడియాశలయ్యాయి. శశికళకు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేల్లో కూడా నిరాశం నెలకొంది. పన్నీరుసెల్వంకు జై కొట్టేందుకు శశికళ వర్గంలోని ఎమ్మెల్యేలంతా సిద్ధమయ్యారు. అయితే శశికళ కోర్టు తీర్పు ప్రతికూలంగా వస్తే ఏం చేయాలన్న దానిపై కూడా గోల్డెన్ బే రిసార్ట్‌లో ఉన్న ఎమ్మెల్యేలతో చర్చలు జరిపారు. తన మేనల్లుడిని తెరపైకి తేవాలని శశికళ భావిస్తున్నారు.
జయలలిత అంత్యక్రియల కార్యక్రమంతో అమ్మ మేనల్లుడు దీపక్ వెలుగులోకి వచ్చాడు. ఇతని పేరును సీఎం అభ్యర్థిగా ప్రకటించాలనే యోచనలో శశికళ ఉన్నట్లు తెలుస్తోంది. పోయెస్‌గార్డెన్‌లో ఉంటున్న శశికళ కుటుంబ సభ్యులు పన్నీరు సెల్వం సీఎం అయిన మరుక్షణం ఖాళీ చేయించనున్నారు. ఆయన ప్రకటించినట్లుగా పోయెస్ గార్డెన్‌లోని జయ నివాసమైన వేద నిలయాన్ని స్మారకంగా మార్చనున్నారు. ఇదిలా ఉంటే, ఆమె అనుచరులు కోర్టు తీర్పును తప్పుబడుతున్నారు. కేంద్రం ఆడిన నాటకంలో శశికళను బలిపశువును చేశారని ఆరోపిస్తున్నారు.