తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో ఆర్టీసీ లాభాల బాట పట్టిందన్నారు మంత్రి కేటీఆర్. ఖమ్మం నగరంలోని బైపాస్ రోడ్డు ప్రాంతంలో రూ.25 కోట్ల తో నిర్మించిన హైటెక్ నూతన బస్టాండ్ ను మంత్రి అజయ్ కుమార్, మంత్రి ప్రశాంత్ రెడ్డి లతో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ. గత కొన్ని సంవత్సరాల నుంచి ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు విముక్తి లభించిందన్నారు. మంత్రి అజయ్ ఆధ్వర్యంలో బస్టాండ్ ను సుందరంగా నిర్మించడం జరిగిందన్నారు
ఆర్టీసీని కూడా బలోపేతం చేస్తూ లాభాల బాట పట్టించేందుకు కార్గో లాంటి సర్వీసులను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం పాటు పడుతుందన్నారు. ఆర్టీసీని మరింత లాభాల్లోకి తీసుకొస్తే మిగతా నగరాల్లోనూ ఆధునికమైన బస్టాండ్లను ఏర్పాటు చేసేందుకు వీలుంటుందన్నారు.
ఖమ్మం పట్టణాన్ని చూసి ఇతర పట్టణాల ప్రజాప్రతినిధులు నేర్చుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీళ్లు ఇచ్చాం. మనం చేసిన పనిని ప్రజలకు గుర్తు చేయాలి. సామాన్యుడికి సేవలందించడమే కాదు.. వారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ముందుచూపుతో పని చేయాలని సీఎం సూచిస్తుంటారని తెలిపారు. ఖమ్మం కార్పొరేషన్‌లో ప్రజల ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధికి అవకాశం ఉంటుందన్నారు.