దేశంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో గెలిచేందుకు బీజేపీ అడ్డదారులు తొక్కుతోంది. పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరిలలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు బీజేపీని టెన్షన్ పెట్టిస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలలో బీజేపీ చిత్తుగా ఓడిపోవడం ఖాయమని సర్వేలు చెబుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ అన్ని చోట్లా ఓడిపోతే ఇక మోదీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్లే అని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఓ రకంగా చెప్పాలంటూ భారత రాజకీయాల దిశను ఈ ఎన్నికలు మార్చబోతున్నాయి. ఈ ఎన్నికలలో ఓడిపోతే దేశంలో బీజేపీ పతనం మొదలయినట్లే అని చెప్పాలి. అందుకే కాషాయపార్టీలో కంగారు మొదలైంది. ప్రధాని మోదీ, అమిత్‌షాల దగ్గరనుంచి కేంద్రమంత్రులు, బీజేపీ సీఎంలు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నారు. మోదీ, అమిత్‌షాలు అయితే కాలికి బలపం కట్టుకుని మరీ బెంగాల్, తమిళనాడు, అసోం, కేరళ, పుదుచ్చేరికి రౌండ్ల మీద రౌండ్లు వేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థి పార్టీలపై నోరు పారేసుకుంటున్నారు.
ఇక ఎన్నికలలో గెలవడానికి బీజేపీ అడ్డదారులు తొక్కుతోంది. ముఖ్యంగా బెంగాల్లో మమతాను ఓడించడానికి వేలాది కోట్ల డబ్బులు ఓటర్లకు పంచుతుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ కూడా బీజేపీ నేతలు కేంద్ర భద్రతా బలగాల వాహనాల్లో యుపీ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాలనుంచి వేల కోట్ల నల్లడబ్బును తరలిస్తున్నారని, ఆ డబ్బును ఓటర్లకు పంచుతున్నారని తీవ్ర ఆరోపణలు గుప్పించింది. ఇక తమిళనాడు ప్రజలకు ఎన్ని వరాలు కురిపించినా బీజేపీ అన్నాడీఎంకే కూటమికి ఓటమి తప్పేలాలేదు. ఇక్కడ డీఎంకే – కాంగ్రెస్ కూటమి అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకే బీజేపీ నేతలు ఓటర్లకు విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ విమర్శిస్తున్నారు.
ఇక కేరళలో సీబీఐని అడ్డంపెట్టుకుని విజయన్ సర్కార్‌ను ఇబ్బంది పెట్టేందుకు బీజేపీ కుట్రలు చేస్తోంది. మరోవైపు అసోంలో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి బీజేపీ నానాతంటాలు పడుతోంది. నిన్న, మొన్నటి వరకు ఇక్కడ అధికారం నిలబెట్టుకుంటామని బీజేపీ పెద్దలు భావించారు. కాని అసోంలో బీజేపీ కూటమికి ఎదురుగాలి వీస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో సానుకూలత వ్యక్తమవుతోంది. దీంతో పెయిడ్ ప్రచారానికి బీజేపీ తెరలేపింది. తాజాగా అసోం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఇచ్చిన వాణిజ్యప్రకటనను పెయిడ్ న్యూస్‌గా ఇవ్వడంపై కాంగ్రెస్ పార్టీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అసోం రాష్ట్ర అసెంబ్లీ మొదటి విడత పోలింగ్ సందర్భంగా బీజేపీ 8 దినపత్రికల్లో ఇచ్చిన ప్రకటనను వార్తగా మభ్యపెడుతూ ఇచ్చింది. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం మోడల్ ప్రవర్తనా నియమావళిలోని సెక్షన్ 126 ఎ లోని నిబంధనలకు విరుద్ధంగా బీజేపీ ఇచ్చిన ప్రకటనను వార్తగా మభ్య పెట్టిందని అసోం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ లీగల్ డిపార్టుమెంట్ ఛైర్మన్ నిరాన్ బోరా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అసోం రాష్ట్ర ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, అసోం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రంజిత్ కుమార్ దాస్, 8 ప్రముఖ దినపత్రికలపై కేసు నమోదు చేశారు. మొత్తంగా పెయిడ్ న్యూస్‌తో అసోం ఓటర్లను మభ్యపెట్టేందుకు చేసిన చీప్ ట్రిక్స్‌తో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, అసోం బీజేపీ సీఎం సోనోవాల్‌లు అడ్డంగా బుక్ అయ్యారు.