ఎనర్జిటిక్ హీరో రామ్ దర్శకుడు పూరి కాంబినేషన్లో ‘ఇస్మార్ట్ శంకర్’ బ్లాక్ బస్టర్ హిట్టైన విషయం తెలిసిందే. ఈ సినిమా సూపర్ హిట్ కావడమే కాదు, రామ్ కి మాస్ ఆడియన్స్ ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది. మాస్ కంటెంట్ ఉన్న పాత్రల్లోను రామ్ దుమ్మురేపేయగలడని చాటిచెప్పింది ఈ చిత్రం.
అయితే ఆ తరువాత రామ్ చేసిన ‘రెడ్’ సినిమాలో కూడా మాస్ క్యారెక్టర్లో కనిపించాడు. కానీ ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆదరణ ఆకట్టుకోలేదు. ఈ సినిమాలో ఆయన ద్విపాత్రాభినయం చేశాడుగానీ, కథాపరంగా కలిసిరాలేదు. దాంతో మళ్లీ వెంటనే మరో హిట్ కొట్టవలసిన బాధ్యత ఆయనపై పడింది.
ఈ నేపథ్యంలో రామ్ తమిళ దర్శకుడు లింగుస్వామితో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో రామ్ మాస్ పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తాడని సినీ వర్గాల సమాచారం. ఇంతవరకూ రామ్ ఈ తరహా పాత్ర చేయకపోవడంతో అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. తెరపై మాస్ పోలీస్ ఆఫీసర్గా రామ్ ఏమేరకు ఆకట్టుకుంటాడో చూడాలి.