జాతి రత్నాలు సినిమా సక్సెస్ మీట్ కి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. నెక్లెస్ రోడ్డులో గురువారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, తనకు అశ్వనీ దత్ తో, వారి కుటుంబంతో 35 ఏండ్ల అనుబంధం ఉందన్నారు. పెద్ద పెద్ద హీరోలు, హీరోయిన్లతో… భారీ బడ్జెట్లతో సినిమాలు తీసిన పెద్ద బ్యానర్ అశ్వనీ దత్ గారిది. అలాటి అశ్వనీదత్ గారి, జాతి రత్నాల్లాంటి బిడ్డ-అల్లుడు కలిసి, స్వప్న సినిమా బ్యానర్ పై తీసిన సినిమా జాతి రత్నాలు. అశ్వనీ దత్ గారు, ఆయన అభిమానులు, ఆయన బ్యానర్ కి తీసిపోని విధంగా అంతా అభినందించే విధంగా తీసిన సినిమా జాతి రత్నాలు అన్నారు.
‘ఎవడే సుబ్రమణ్యం’, ‘మహానటి’ వంటి వైవిధ్య భరిత చిత్రాలతో జాతీయ స్థాయిలో మెరిసిన దర్శకుడు నాగ్ అశ్విన్, జాతి రత్నాలు సినిమా కోసం దర్శకుడిగా మారడం విశేషం అన్నారు. కె.వి.అనుదీప్ దర్శకుడిగా నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ఫరియా ప్రధాన పాత్రల్లో ఈ సినిమా తీశారు. తామే తెలివైన వాళ్ళం అనుకునే, తింగరి కుర్రాళ్ళు జోగిపేటలో వాళ్ళ ఇండ్లల్లో చాలెంజ్ చేసి, హైదరాబాద్ చేరి, ఓ హత్య కేసులో ఇరుక్కున్న సంఘటనను ఫన్నీగా చూపించి, సూపర్, డూపర్ హిట్ కొట్టారు. ఒక్క మాటలో చెప్పాలంటే…వినోదంతో విజయం సాధించారని మంత్రి చిత్ర యూనిట్ ని అభినందించారు.
మరిన్ని విజయాలు సాధించే స్థాయి సినిమాలు తీసి తండ్రికి తగ్గ తనయగా, అల్లుడిగా మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షిస్తున్నా…ఈ సినిమాలో పని చేసిన నటీనటులు, టెక్నీషియన్స్ అందరికీ…ఆల్ ది బెస్ట్!! అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చిత్ర యూనిట్ కి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో హీరోలు, హీరోయిన్లతోపాటు, మ్యూజిక్ డైరెక్టర్ రధన్, హీరో నరేశ్ తదితరులు హాజరు కాగా, సుమ యాంకర్ గా వ్యవహరించారు.