బీజేపీ నేతలుచెప్పేది ఒకటి.. చేసేది మరొకటి అని మరోసారి తేలిపోయింది.చారాణా పనికి బారాణ పబ్లిసిటీ ఇచ్చుకోవడంలో ప్రధాని మోదీ తర్వాతే ఎవరైనా..మోదీ, కేంద్రమంత్రుల దగ్గర నుంచి తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర బీజేపీ నేతల వరకు అందరిది ఇదే వరస.. ఇచ్చింది పావలా..అయితే రూపాయి ఇచ్చినంత బిల్డప్ ఇవ్వడంలో కాషాయ నేతలు పీహెచ్‌డీలు చేసారు. తాజాగా పశ్చిమబెంగాల్ ఎన్నికలలో కేంద్ర ప్రభుత్వ పథకాలపై బీజేపీ విపరీతంగా పబ్లిసిటీ చేసుకుంటోంది. ఈసారి ఎలాగైనా మమతా బెనర్జీని ఓడించి బెంగాల్ గడ్డపై కాషాయజెండా ఎగరవేయాలని మోదీ, అమిత్‌షాలు పట్టుదలగా ఉన్నారు. అందుకోసం బెంగాల్ ప్రజలపై వరాల మీద వరాలు కురిపించారు. బంగారు బెంగాల్ చేస్తామని ఓటర్ల చెవిలో కమలం పువ్వులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
అంతే కాదు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కేంద్ర పథకాల అమలుపై పేపర్లు, టీవీ ఛానల్స్‌కు పెద్ద ఎత్తున యాడ్స్ ఇచ్చి పబ్లిసిటీని పీక్స్‌లోకి తీసుకువెళుతున్నారు.అయితే తాజాగా బెంగాల్‌లో కేంద్ర ప్రభుత్వం నిర్మించిన ఇళ్లపై బీజేపీ ఇచ్చిన పేపర్ యాడ్ బూమరాంగ్ అయింది. బెంగాల్‌లో స్థానిక దినపత్రికలో కేంద్రం రాష్ట్రంలో ఏకంగా 24 లక్షల ఇళ్ళను నిర్మించిందని, ప్రధాని నరేంద్రమోదీ పాలనలో బెంగాల్ పేదలు సొంతింటిలో ఆత్మగౌరవంతో బతుకుతున్నారని ఆ పేపర్ యాడ్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు ఆ యాడ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ చేతులు కట్టుకుని ఉన్న పెద్ద ఫోటో ఓ పక్కన…ఇంకో పక్క కేంద్రం కట్టించి ఇచ్చిన ఇంటి ముందు నిల్చున్న ఓ మహిళ ఫోటో ప్రచురించారు. అయితే బెంగాల్‌లో కేంద్రం ఇచ్చింది గోరంత…ప్రచారం మాత్రం కొండంత అంటూ బీజేపీ ఇచ్చిన ఈ ప్రకటనపై అధికార టీఎంసీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు మండిపడుతున్నాయి.
అసలు బెంగాల్‌లో పేదలకు 24 లక్షల ఇళ్లు ఎక్కడ ఇచ్చారో చూపించండి అంటూ ప్రతిపక్ష పార్టీల నేతలు బీజేపీపై విరుచుకుపడుతున్నారు. అయితే బెంగాల్‌లో 24 లక్షల ఇళ్లను మోదీ సర్కార్ కట్టించిందంటూ బీజేపీ ఇచ్చిన ఈ పేపర్ యాడ్ ఫేక్ అని తేలిపోయింది. ఆ యాడ్‌లో సొంతింటి ముందు నవ్వులు చిందిస్తూ ఉన్న ఆ మహిళకు అసలు ఇల్లే లేదు..ఆమె ఓ గుడిసెలో నివసిస్తోంది. స్థానిక బీజేపీ నేతలు ఈ యాడ్ కోసం ఆమెను ఓ ఇంటి ముందు నిలబెట్టి ఫోటో తీసి..పేపర్‌లో ప్రచురించారు. ఇళ్ల నిర్మాణంపై బీజేపీ ఇచ్చిన యాడ్‌పై ఓ రిపోర్టర్‌కు అనుమానం వచ్చింది. వెంటనే ఆ యాడ్‌లో ఉన్న మహిళ ఆచూకీ కనుక్కొని ఆమె దగ్గరకు వెళ్లాడు. తీరా చూస్తే ఆ మహిళకు అసలు ఇళ్లే లేదు..ఓ గుడిసెలో నివసిస్తుందని తెలుసుకున్నాడు. దీంతో ఆ మహిళ సాక్షిగా బీజేపీ బోగస్ యాడ్ బండారాన్ని సదరు రిపోర్టర్ బయటపెట్టాడు. బీజేపీ బోగస్ యాడ్‌పై బెంగాల్‌లో అధికార టీఎంసీతో సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు భగ్గుమంటున్నాయి. బీజేపీ బోగస్ యాడ్ మమతాదీదీకి ఓ అస్త్రంలా మారింది. మోదీ, అమిత్‌షాల చీప్ పబ్లిసిటీ ట్రిక్స్‌ను ఏకిపారేస్తున్నారు. మొత్తంగా బీజేపీ బోగస్ యాడ్ బండారం బట్టబయలు కావడంతో బెంగాల్ ఎన్నికలకు ముందే మోదీ, అమిత్‌షాల ఇజ్జత్ పోయినట్లైంది.