దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తున్నది. గత వారం రోజులుగా రోజువారీ కేసులు క్రమంగా అధికమవుతూ వస్తున్నాయి. దేశంలో మార్చి 14 నాటికి మొత్తం 22,74,07,413 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్) తెలిపింది. ఇందులో ఆదివారం ఒక్కరోజే 7,03,772 నమూనాలను పరీక్షించామని వెల్లడించింది. ఇక ఆదివారం 25 వేల పైగా కేసులు నమోదవగా, ఈరోజు ఆ సంఖ్య 26 వేలు దాటింది.
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 26,291 పాజిటివ్ కేసులు నమోదవగా, 118 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,13,85,339గా ఉండగా, మరణాలు 1,58,725కు చేరుకున్నాయి. మొత్తం కేసుల్లో 1,10,07,352 మంది బాధితులు మహమ్మారి బారినుంచి కోలుకున్నారు. మరో 2,19,262 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
కాగా, నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 17,455 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇక దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటివరకు మొత్తం 2,99,08,038 మంది వ్యాక్సిక్ తీసుకున్నారని తెలిపింది.