కేజీఎఫ్ హీరో యష్ కుటుంబం భూవివాదంలో చిక్కుకున్నారు. యశ్‌పై రాజ్య రైతు సంఘం కార్యాధ్యక్షుడు అణ్ణాజప్ప హాసన్ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. యశ్ తల్లిదండ్రులు ఇటీవల దుద్ధ హోబళి తిమ్మాపుర గ్రామంలో కొనుగోలు చేసిన భూమిలో అక్రమంగా ప్రహరీ నిర్మించి రైతులను ఇబ్బందులకు గురి చేశారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అభ్యంతరాలు తెలుపుతోన్న రైతులను ఇబ్బంది పెట్టారని, గూండాలను పిలిపించి గ్రామస్థులను యశ్ భయపెడుతున్నాడని ఆయన ఆరోపణలు చేశారు. తమ ఫిర్యాదును స్వీకరించి, రైతులకు న్యాయం చేయాలని కోరారు.
ఈ భూమిలో నిర్మాణాలపై యశ్ తల్లికి, గ్రామస్థులకి మధ్య ఇటీవల గొడవ చెలరేగింది. తిమ్మాపుర గ్రామంలో యశ్ కుటుంబం తాజాగా 80 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. ప్రహారీ గోడ కట్టి తమ పొలాలకు దారిని మూసివేశారని యశ్ కుటుంబ సభ్యులతో గ్రామస్థులు గొడవకు దిగారు. ఇప్పటికే ఈ విషయంపై పోలీసు స్టేషన్ లోనూ గ్రామస్థులు ఫిర్యాదు చేశారు.