` మా` మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కమిటి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈసీ మెంబర్ల చివరి సమావేశం మంగళవారం హైదరాబాద్ బృగవాణి రిసార్స్ట్ లో జరిగింది. ఈ సందర్భంగా జనరల్ సెక్రటరీ శివాజీ రాజా మాట్లాడుతూ `రెండేళ్ల పాటు అంతా కలిసి మెలసి పనిచేశాం. ఈ సందర్భంగా `మా` టీమ్ కు సహకరించిన కమిటీ మెంబర్లందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా` అన్నారు.
మా అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ “ అందరికి కృతజ్ఞతలు తెలియజేసే రోజు ఇది. మా హిస్టరీలో ఎప్పుడూ ఎవ్వరూ కని విని ఎరుగని స్టేజ్ లో ఎలక్ట్ అయి ఆ సమయంలో మేము తీసుకున్న కఠిన నిర్ణయాలు `మా` అభివృద్దికి ఎంతో దోహదం చేశాయన్నారు. సభ్యులకు సంబంధించి గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఎవరు ఏ పోజిషన్ లో ఉన్నారన్న విషయాలను నరేష్ సర్వే చేసి తెలుసుకుని సేవలందించామని … అన్ని పనులను బలంగా సంకల్పించి చేస్తాం కాబట్టే సక్సెస్ అయ్యామన్నారు. శివాజీ రాజా నా వెన్నెంటే ఉండి నా ఆలోచనలకు తోడుగా నిలిచి సపోర్ట్ ఇచ్చారన్న రాజేంద్రుడు….. ప్రపంచ దేశాల్లో కూడా నేడు `మా` అంటే ఏంటో తెలిసిందని ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.తెలియకుండా ఏవైనా తప్పులు జరిగుంటే క్షమించమని కోరిన రాజేంద్రప్రసాద్ …. ఈ అవకాశం కల్పించిన కమిటీ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
ట్రెజరర్ పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ `ఇప్పటివరకూ చాలా అసోసియేషన్లతో కలిసి పనిచేశాను. కానీ వాటన్నింటికంటే ఉత్తమమైన కమిటీ ఇది. కమిటీ సభ్యులంతా ఆరోగ్యకరమైన వాతావరణంలో కలిసి పనిచేసే అవకాశం ఇచ్చినందకు కృతజ్ఞతలు` అని అన్నారు.
వైస్ ప్రెసిడెంట్ శివకృష్ణ మాట్లాడుతూ “ ఎన్నికల్లో పోటీ వాతావరణం సహజం. ఎవరు గెలిస్తారన్నది ముఖ్యం కాదు. గెలిచిన వాళ్లు కమిటీకి సేవ చేయాలి. ఈసారి అంతా కలిసి ఓ కమిటి వేసుకుని పోటీ లేకుండా ఎన్నుకుంటే మంచిదన్నది నా ఉద్దేశం. ఇక్కడ పోటీ చేయడానికి ఎవ్వరూ సిద్దంగా లేరు` అని అన్నారు.
జాయింట్ సెక్రటరీ నరేష్ మాట్లాడుతూ ` అద్భుతమైన పుస్తకానికి అఖరి పేజీ లాంటిది ఈ రోజు. ఒక మార్పు రావాలని కోరుకున్నాం. మా హయాంలో ఆ మార్పు వచ్చింది. ఎన్నికల సమయంలో ఈ కమిటి ఏ మాట ఇచ్చిందో? ఆ మాట నిలబెట్టుకుంది. ఈ కొత్త టీమ్ వచ్చిన తర్వాత పనులన్నీ బాగా జరిగాయి. అంతా ఆరోగ్యకరమైన వాతావరణం లో పనిచేశాం. ఎవరి మీద ఎలాంటి కంప్లైంట్ లేకుండా పనిచేశాం. కమిటీలు వేసి లోన్ ఫెసిలిటీలన్నీకల్పించాం. అలాగే ఉపాది అవకాశాలను కల్పించాం. మేం చేయగల్గిన పనులన్నింటినీ సక్రమంగా చేయగలిగాం. మెంబర్లు ఏం కోరినా కమిటీ సభ్యులు వెంటనే ఏర్పాటు చేశారు` అన్నారు.
ఈసీ మెంబర్ గీతాంజలి మాట్లాడుతూ `మా టీమ్ తో ఎప్పటి నుంచో నా జర్నీ కొనసాగుతుంది. ఇప్పుడు కొత్త టీమ్ తో కలిసి పనిచేసినందుకు సంతోషంగా ఉంది. భవిష్యత్ లో కూడా ఇలాగే కొనసాగిలి. `మా` తరుపు నుంచి సేవలు ఇంకా వైభవంగా జరగాలి అని కోరుకుంటున్నా` అన్నారు.
ఈసీ మెంబర్ బెనర్జీ మాట్లాడుతూ `రెండేళ్లు పాటు చాలా అద్భుతంగా కమిటీ రన్ అయింది. శివాజీరాజా, శ్రీరామ్, నరేష్ అంతా బాగా గ్రౌండ్ వర్క్ చేశారు. రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్లందరికి కావాల్సిన వరనులు సమకూర్చారు. కొత్త కమిటీ ఎన్నికలు లేకుండా కొత్త టీమ్ ను ఎన్నుకుంటే బాగుంటుంది. ఇలాగే కలిసి మెలిసి పనిచేయాలి` అన్నారు.
ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు బ్రహ్మాజీ, ఢిల్లీ రాజేశ్వరీ, ఏడిద శ్రీరామ్, గౌతం రాజు, హరినాథ్ బాబు, హేమ, జాకీ, కాదంబరి కిరణ్, మాణిక్, నర్సింగ్ యాదవ్, పసునూరి శ్రీనివాసులు, శ్రీ శశాంక్, సురేష్ కొండేటి, విద్యాసాగర్ పాల్గొన్నారు.కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానిథులుగా పరుచూరి గోపాల కృష్ణ, హీరో శ్రీకాంత్ హజరయ్యారు. అలాగే `మా` లీగల్ అడ్వైజర్ కృష్ణమోహన్ పాల్గొన్నారు.