భారతదేశం పేరును ‘మోదీ’గా మార్చే రోజు ఎంతో దూరంలో లేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోమవారం కోల్‌కతాలో ‘దీదీర్ సాథ్ అమ్రా (దీదీతో మేమున్నాం) ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం మమత మాట్లాడుతూ.. ఏదో ఒక రోజు దేశానికి మోదీ పేరు పెట్టే రోజు దగ్గరలోనే ఉందన్నారు. కొవిడ్-19 వ్యాక్సిన్ సర్టిఫికెట్‌పై ప్రధాని ఫోటో ముద్రించడాన్ని దీదీ తప్పుపట్టారు. ‘ ఓ స్టేడియానికి ప్రధాని పేరు పెట్టారు..కొవిడ్ సర్టిఫికెట్లపై ఆయన ఫోటోలు ముద్రించారు..దేశానికి ఆయన పేరు పెట్టేరోజు ఎంతో దూరంలో లేద’ని మమతా బెనర్జీ అన్నారు.
బెంగాల్‌లో తృణమూల్ సర్కార్‌కు వ్యతిరేకంగా ప్రధాని మోదీ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోని 294 నియోజకవర్గాల్లో ప్రజలు దీదీ వర్సెస్ బీజేపీ పోరుగా చూస్తున్నారని వ్యాఖ్యానించారు. మోదీ చెబుతున్న ప్రతి ఒక్కటీ అబద్ధమేనన్న మమత.. బెంగాల్‌లో మహిళలకు భద్రత లేదని మోదీ ఉపన్యాసాలు దంచికొడుతున్నారని, మరి బీజేపీ పాలిత ప్రాంతాల్లో మహిళల పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాలని సూచించారు.