పేదల కోసమే జన ఔషధి- ప్రధాని మోదీ

186
pm modi
- Advertisement -

ఆదివారం జ‌న ఔష‌ధి దివ‌స్‌ను పుర‌స్క‌రించుకుని ప్రధాని నరేంద్ర మోదీ మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో దేశంలోని 7,500వ జన ఔషధిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ.. ప్ర‌స్తుతం వివిధ రోగాల కోసం వాడే ఔష‌ధాలు ఖ‌రీదైపోయాయ‌ని, దాంతో త‌క్కువ ధ‌ర‌ల‌కే ఔష‌ధాల‌ను అందించే పీఎం జ‌న ఔష‌ధి కేంద్రాలు పేద‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు ఎంతో ఉప‌యుక్తంగా ఉన్నాయ‌ని మోదీ చెప్పారు. ప్రాణాధార ఔషధాల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయని, ఔషధాలను ప్రజలకూ అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా జన ఔషధి పథకాన్ని ప్రారంభించామని చెప్పారు. ఈ ఔషధ దుకాణాలతో పేదలు డబ్బు ఆదా చేసుకోవచ్చని అన్నారు. ప్రజలు ‘మోదీ దుకాణం’ అని పిలుచుకునే జన ఔషధిల్లోనే మందులు కొనాలని ఆయన పిలుపునిచ్చారు.

వీటి ద్వారా మహిళలు శానిటరీ ప్యాడ్లను కేవలం రెండున్నర రూపాయలకే కొనుగోలు చేయవచ్చన్నారు. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 11 కోట్ల శానిట‌రీ నాప్కిన్స్ అమ్ముడుపోయాయ‌ని తెలిపారు. మొత్తం జ‌న ఔష‌ధీ కేంద్రాల్లో 1000 కేంద్రాల‌ను మ‌హిళ‌లే నిర్వ‌హిస్తున్నార‌న్నారు. ‘‘పేద, మధ్యతరగతి ప్రజల కోసం దేశ వ్యాప్తంగా ప్రధాన మంత్రి జన ఔషధి పథకాన్ని అమలు చేస్తున్నాం. దీని ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కూడా లభిస్తున్నాయి. 75 ఆయుష్ మందులనూ దేశంలోని అన్ని జన ఔషధి కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలని నిర్ణయించాం’’ అని మోదీ చెప్పారు. కాగా, కార్యక్రమంలో జన ఔషధి ద్వారా లబ్ధి పొందుతున్న వారితో ప్రధాని మాట్లాడారు. వారి అనుభవాలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు.

- Advertisement -