కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఆందోళన 73వ రోజుకు చేరగా ఇవాళ దేశవ్యాప్తంగా చక్కా జామ్ జరగనుంది.
చక్కా జామ్ పేరుతో మూడు గంటల పాటు జాతీయ, రాష్ట్ర రహదారులను దిగ్బంధం చేయనున్నారు. చక్కా జామ్ నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఢిల్లీ సరిహద్దుల్లో రోడ్లకు అడ్డంగా బారికేడ్లు, ఇనుప తీగలు పెట్టారు. ఘాజీపూర్ సరిహద్దు మొత్తం పోలీసులతో నిండిపోయింది. చక్కాజామ్‌ను శాంతియుతంగా నిర్వహిస్తామని రైతు సంఘాల నేతలు ప్రకటించారు. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు రహదారుల దిగ్బంధం జరుగనుంది.
మరోవైపు దేశంలో రైతుల ఆందోళనలపై ఐక్యరాజ్యసమితి స్పందించింది. ప్రభుత్వం, రైతులు సమన్వయం పాటించాలని అలాగే భావవ్యక్తీకరణ హక్కులను రక్షించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సమస్యలకు నిష్పాక్షిక పరిష్కార మార్గాలను కనుగొనాలని పిలుపునిచ్చింది.