వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌..

137
minister ktr
- Advertisement -

నూతన సాంకేతిక పరిజ్ఞానాలతో సాధారణ పౌరులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలతో పాటు సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లను సైతం పరిష్కరించవచ్చని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కే. తారకరామారావు అన్నారు. ఈ రోజు వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన ఒక సదస్సులో మంత్రి పాల్గొన్నారు. భారతదేశంలో ఎమర్జింగ్ టెక్నాలజీలకు ప్రోత్సాహం అనే ఈ అంశం పైన జరిపిన ఈ వర్చువల్ సమావేశంలో మంత్రి కేటీఆర్ పలు అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. సికోయ క్యాపిటల్ ఎండి రాజన్ ఆనందన్, బేర్ ఫుట్ కాలేజ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ మేఘన్ ఫల్లోన్ మరియు యు పి ఎల్ లిమిటెడ్ గ్లోబల్ సీఈవో జై శ్రాఫ్, మంత్రి కేటీఆర్‌తో ఈ చర్చాగోష్టిలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీ రామారావు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానాన్ని సాధారణ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఉపయోగించుకోవడంలో ముందువరుసలో ఉంటుందని, గత ఆరు సంవత్సరాలుగా అనేక ప్రభుత్వ సేవల విషయంలో ప్రభుత్వం ఎమర్జింగ్ టెక్నాలజీలను సైతం వాడుకుందని తెలిపారు. ముఖ్యంగా వ్యవసాయ రంగం,హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ వంటి రంగాల్లో ఇన్నోవేషన్ మరియు ఎమర్జింగ్ టెక్నాలజీల వలన విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని మంత్రి కేటీఆర్ ఈ చర్చాగోష్టిలో అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగము, హెల్త్‌కేర్ రంగంలో మెడిసిన్స్ ఫ్రమ్ ది స్కై వంటి ప్రాజెక్టులను ప్రస్తావించారు. అయితే ఆధునిక ఎమర్జింగ్ టెక్నాలజీలు సాధారణ ప్రజలకు అందుబాటులోకి రావాలంటే దేశంలో డిజిటల్ ఇన్ఫ్రా నిర్మాణం భారీ ఎత్తున చేపట్టాల్సిన అవసరం ఉందని, ఈ రంగంలోనూ తెలంగాణ ప్రభుత్వం ముందువరుసలో ఉందన్నారు.

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రతి ఇంటిని ఇంటర్నెట్‌తో అనుసంధానం చేసేందుకు అవసరమైన తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు కార్యక్రమాన్ని త్వరలోనే పూర్తి చేయబోతున్నట్లు ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలిపారు. ఒకవైపు ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుతో పాటు భవిష్యత్తులో రానున్న 5జి టెక్నాలజీ వంటి వాటి ద్వారా మారుమూల ప్రాంతాల్లోనూ ఇంటర్నెట్ వినియోగం వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయని, అయితే ఈ ఎమర్జింగ్ టెక్నాలజీలను వినియోగించుకొని ప్రజల జీవితాల్లో ఎలాంటి సానుకూల మార్పు తీసుకురావాలో ప్రభుత్వాలు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ టెక్నాలజీల సహకారంతో ఏడ్యు టెక్, మెడ్ టెక్, అగ్రి టెక్ వంటి రంగాల్లో అవసరమైన ఇన్నోవేషన్‌ను ప్రోత్సహించాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అన్నారు.

ప్రస్తుత కోవిడ్ సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటున్నదని, టెక్నాలజీనీ వినియోగించుకొని వివిధ రంగాల్లో మరింత వేగంగా వృద్ధి బాట పట్టే దిశగా ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం మానవాళికి కోవిడ్ విసిరిన సంక్షోభం నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని, భవిష్యత్తులో రానున్న సంక్షోభాలను ఎదుర్కొనేందుకు టెక్నాలజీ ఆధారిత పరిష్కారాలను ఇప్పటి నుంచే సిద్ధం చేసుకోవాలని, తద్వారా హెల్త్ కేర్ రంగం భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధం అవుతుందని మంత్రి అన్నారు. ఎన్ని సాంకేతిక పరిజ్ఞానాలను అందిపుచ్చుకున్నా, సామాన్య మానవుడి జీవితాల్లో సానుకూల మార్పులు తేకపోతే అది వృధా అని, టెక్నాలజీల వినియోగం పట్ల ఇదే స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు.

- Advertisement -